ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్ ఏంచేస్తున్నారో తెలుసా..?
ఓవైపు సమీక్షలు, మరోవైపు వరుస సమావేశాలు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తూనే ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందుకోసం ఆయన త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అరగంట ప్రజల విన్నపాలు స్వీకరించనున్నారు ముఖ్యమంత్రి. జులై మొదటి వారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎంను కలిసేందుకు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వస్తున్నారు. దీంతో.. సెక్యూరిటీ సమస్యగా మారుతోంది. దీంతో ప్రజాదర్బార్‌లో ప్రజలు కలుసుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కూడా.. తన నియోజకవర్గం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో.. స్పాట్‌లో పరిష్కరించేవి ఉంటే.. అక్కడికక్కడే నిర్ణయం తీసుకుంటారు. ఏమైనా ఇబ్బందులుంటే వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపుతారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే తరహాలో సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. వారి సమస్యలకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించేవారు. తండ్రి బాటలోనే జగన్ కూడా ప్రజా దర్బార్ నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com