మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆరాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు వెళుతున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం పదిన్నరకు ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుంటారు. నేరుగా రాజ్‌భవన్ కు వెళ్లి అక్కడ గవర్నర్‌ను కలుసుకుంటారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ అధికారిక నివాసానికి వెళ్లి కలుస్తారు. 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎంను స్వయంగా ఆహ్వానిస్తారు.
ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా విజయవాడకు వెళ్లి స్వయంగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే అమరావతి వెళ్లనున్నారు. గోదావరిపై కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అడ్డంకులు అధిగమించింది కేసీఆర్ ప్రభుత్వం. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. దిగువ రాష్ట్రం అయినా ఏపీతో కూడా జలసమస్యలు పరిష్కరించుకుని పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో బాగంగా ఏపీ సీఎం జగన్ ను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com