టిక్‌టాక్‌ వీడియో చేస్తూ మహిళ బలవన్మరణం

టిక్‌టాక్‌ వీడియో చేస్తూ మహిళ బలవన్మరణం

టిక్‌టాక్‌ యాప్‌ వినియోగించొద్దని భర్త మందలించడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిందో మహిళ. తన ఆత్మహత్య ప్రయత్నాన్నీ ఆ మహిళ టిక్‌టాక్‌లో పెట్టడం సంచలనంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా సెందురైలోనున్న వంగారం గ్రామంలో చోటుచేసుకుంది.

అనిత అనే మహిళ టిక్‌టాక్‌తో తరచూ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంది. ఆమె భర్త పళనివేలు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి అనిత పెరంబలూరులో ఉంటోంది. ఆమెకు టిక్‌ టాక్‌ యాప్‌పై ఆసక్తి పెరిగిపోయింది. పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం, మేకప్‌ వేసుకోవడం వంటి వీడియోలను నిత్యం యాప్‌లో పెట్టేది. ఈ విషయం కాస్తా ఆమె భర్తదాకా వెళ్లింది. దీంతో పళనివేలు మందలించాడు.

ఇటీవల కూతురు మోనీష ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విషయం తెలుసుకున్న పళనివేలు.. ఫోన్‌ చేసి భార్యను గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగుతూ ఇదే నా ఆఖరి ‘టిక్‌ టాక్‌’ వీడియో అని పేర్కొంటూ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తూ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలోనూ టిక్‌ టాక్‌కు బానిసయ్యిందంటూ ఓ భర్త తన భార్యను హత్య చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story