ట్రిపుల్‌ తలాక్ బిల్లుకు కేంద్రమంత్రివర్గం మరోసారి ఆమోదం

ట్రిపుల్‌ తలాక్ బిల్లుకు కేంద్రమంత్రివర్గం మరోసారి ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల పైనా మంత్రులు చర్చించారు. జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో.... 2018 డిసెంబర్‌ 19 నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే 6 నెలల కాలం ముగిసింది. తిరిగి రాష్ట్రపతి పాలన కోరుతూ కేంద్రానికి జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ లేఖ రాశారు. దీంతో కేంద్ర కేబినెట్‌ రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ట్రిపుల్‌ తలాక్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకు వెళ్లాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది. 16వ లోక్‌సభ‌లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందినా, రాజ్యసభలో పెండింగ్ లో ఉండిపోయింది. అయితే, 16వ లోక్‌సభ కాలం ముగిసిపోవడంతో ఇప్పుడు కేంద్రం మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈనెల 17 నుంచి 17వ లోక్‌సభ కాలం ప్రారంభం కానుంది. మొదటి సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర విద్యా సంస్థల బిల్లు-2019కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్‌లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికలపైనా మంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది. అమర్‌నాథ్ యాత్ర ఆగస్ట్‌లో ముగుస్తుంది. ఈ యాత్ర తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Tags

Next Story