సోషల్ మీడియాలో వరుణుడిపై జోకులు..

ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వరుణుడు కైవసం చేసుకున్నాడు. అదేంటి వరణుడు టాప్ ప్లేస్‌లో నిలవడమేంటి అనుకుంటున్నారా... ప్రస్తుతం వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే నాలుుగు మ్యాచ్‌లు రద్దవడంతో సోషల్ మీడియాలో వరుణుడిపై జోకులు పేలుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో న్యూజిలాండ్‌ను పక్కన పెట్టి వరుణుడికి టాప్ ప్లేస్ ఇచ్చేశారు. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లు ఆడాలంటే వాటర్‌లోనే ఆడాలని ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అసలు ఐసిసి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకునే షెడ్యూల్ ప్లాన్ చేసిందా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీని నిర్వహిస్తున్నప్పుడు వాతావరణాన్ని పరిగణలోకి తీసుకున్నామని ఐసిసి చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దవడంతో ఐసిసి తీరుపై మరింత మాటల దాడి పెరిగింది.
అసలు ఇంగ్లాండ్‌లో జూన్ మూడో వారం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా ఉండదన్నది చాలా మంది చెబుతోన్న మాట. అయితే షెడ్యూల్‌ను మే 30 నుండే మొదలుపెట్టడంతో వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. సాధారణంగా వాతావరణాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేమన్నది వాస్తవమే అయినా ఐసిసి ప్లానింగ్‌నే అంతా తప్పుపడుతున్నారు. దీనికి తోడు రిజర్వ్ డేలు పెట్టకపోవడం అభిమానుల్లో మరింత అసహనం కనిపిస్తోంది.
టోర్నీ సుదీర్ఘంగా ఉంటుందన్న సాకుతో లీగ్ స్టేజ్‌లో రిజర్వ్ డే పెట్టలేదని ఐసిసి ప్రకటించింది. కేవలం నాకౌట్ స్టేజ్‌లో మ్యాచ్‌లకే కేటాయించినట్టు వెల్లడించింది. అయితే ప్రస్తుత ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్‌కు వచ్చేసరికి ఇంగ్లాండ్‌లో వాతావరణం క్రికెట్ ఆడేందుకు పూర్తి అనుకూలంగా ఉంటుందని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో వరుణుడు అడ్డుపడే అవకాశాలున్న లీగ్ స్టేజ్‌ను వదిలేసి రిజర్వ్ డేలను నాకౌట్‌కే పరిమితం చేయడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే అన్ని జట్లకూ ఇబ్బందే. ప్రస్తుత టోర్నీలో లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్ ఫోర్ టీమ్స్‌ను వరుణుడే డిసైడ్ చేసే అవకాశాలున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com