హై అలర్ట్ .. దిశ మార్చుకుని దూసుకువెళ్తున్న తుఫాను

హై అలర్ట్ .. దిశ మార్చుకుని దూసుకువెళ్తున్న తుఫాను
X

గుజరాత్‌కు 'వాయు' గండం తప్పింది. తీరం వైపు శరవేగంగా దూసుకొచ్చిన తుఫాన్ దిశ మార్చుకుంది. తీరం వైపు కాకుండా సముద్రంలోకి పయనిస్తోంది. అయితే తుఫాను దిశ మార్చుకున్నప్పటికీ గుజరాత్‌ పశ్చిమ తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ముందుగా ఊహించినట్టు తుఫాన్ ఆ రాష్ట్రాన్ని తాకడం లేదు. పోర్‌బందర్-మహువా వద్ద తీరాన్ని తాకుతుందని భావించినప్పటికీ, అనూహ్యంగా సైక్లోన్‌ దిశ మార్చుకుంది. తీరం వైపు కాకుండా సముద్రంలోకి వెళ్తోంది. ప్రస్తుతం అది అరేబియా సముద్రంవైపు ఉత్తర, వాయవ్య దిశగా కదులుతోంది. తుఫాన్ హెచ్చరికలతో మూడు నాలుగురోజులుగా టెన్షన్ పడుతున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సైక్లోన్ దిశ మార్చుకున్నప్పటికీ గుజరాత్ తీర ప్రాంతాలపై మాత్రం ప్రభావం బలంగానే ఉంది. వర్షాలు-ఈదురు గాలుల ధాటికి తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. వచ్చే 48 గంటల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రఖ్యాత సోమనాథ్ ఆలయంలోని ప్రవేశ ద్వారం షెడ్‌ పైకప్పు ఎగిరిపోయింది. ఆలయాన్ని రాకాసి అలలు చుట్టుముట్టాయి. పోరుబందర్‌లోని చౌపట్టీ బీచ్ వద్ద అలలు ఉగ్రరూపం దాల్చాయి. వెరెవల్‌లోని జలేశ్వర్‌ సముద్ర తీరం వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

తుఫాను దృష్ట్యా సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 400 గ్రామాలపై సైక్లోన్ ప్రభావం ఉంటుందని అంచనా. దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. వాయు ప్రభావం కారణంగా 150 రైలు సర్వీసులను రద్దు చేశారు. గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ నుంచి దాదాపు 3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తక్షణ సాయం అందించేందుకు 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పశ్చిమ రైల్వే 77ట్రైన్లు రద్దు చేయగా.. మరో 28రైళ్ల దారి మళ్లించింది. విమాన సర్వీసులపైనా తుఫాను ప్రభావం పడింది. పోర్ బందర్, డయ్యూ, భావ్ నగర్, కాండ్లా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలు నిలిచిపోయాయి.

ముంబైపైనా వాయు ప్రభావం వాయు తుఫాను ప్రభావం పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో దాదాపు 400 ఫైట్లు రాకపోకలు ఆలస్యమయ్యాయి. రెండు విమానాలను దారి మళ్లించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తుఫాన్‌పై పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్రివిధ దళాలు, తీర ప్రాంత రక్షణ దళం, బీఎస్ఎఫ్ జవాన్లు అందరూ తుఫాను సహాయ చర్యల్లో ఉన్నారు.

Tags

Next Story