విజయవాడ నగరపాలక సంస్ధలో దోపిడీ.. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర ఖర్చు ..

విజయవాడ నగరపాలక సంస్ధలో దోపిడీ.. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర ఖర్చు ..

ఖజానా నిల్ అంటారు. బిల్లులు మాత్రం లక్షల్లో చెల్లిస్తారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనం లూటీ చేస్తున్నారు. నెల రోజుల్లో బెజవాడ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్నా.. స్టాండింగ్ కమిటీ సమావేశంలో హడావుడిగా లక్షల రూపాయల బిల్లులు ఆమోదించేసుకుంటున్నారు.

విజయవాడ నగరపాలక సంస్థలో వ్యయ నియంత్రణకు అడ్డుకట్ట పడలేదు. అడ్డగోలు ఖర్చులను పాలకులు, అధికారులు ఏ స్థాయిలోను ఆపడం లేదు. లక్షల్లో వస్తున్న బిల్లుల్లో అక్రమాలెన్నో. ఆనంద ఆదివారం కోసం దాదాపు 4.5 లక్షలు ఓ ప్రైవేట్ సంస్థకు అడ్వాన్స్ చెల్లించారు. ఎన్నికల సందర్భంగా హ్యాపీ సండే అటకెక్కగా.. ఇప్పుడెవరూ పట్టించుకోవట్లేదు. అలా అడ్వాన్స్ ఆవిరైపోయింది. ఒక ప్రైవేట్ సంస్థ గతంలో నిర్వహించిన పుష్ప ప్రదర్శనకు 10 లక్షలు దారి మళ్లించారు. నాడు గులాబీ మొక్కలు సరఫరా చేసినందుకని ఇప్పుడు 3.8 లక్షల బిల్లు ఆమోదానికి పంపడం హాట్ టాపిక్ అయింది.ఇటీవల కొందరు కార్పొరేటర్లు వారం రోజులు విజ్ఞాన యాత్ర చేసొచ్చారు. అందుకైన ఖర్చు 29.75 లక్షలు.

ఇందిరాగాంధీ స్టేడియంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా వేదిక, బ్యానర్ల ఏర్పాటుకు అయిన వ్యయం 3.9 లక్షలు. విజేతల బహుమతులకు మరో 12వేలు అదనం.భవానీ దీక్షల విరమణ సందర్భంగా జరిగిన దోపిడీ బెజవాడకే ప్రత్యేకం. దుర్గాఘాట్, కెనాల్ రోడ్‌, కార్పొరేషన్ ఆఫీస్, సీతమ్మవారి పాదాల వంటి ప్రాంతాల్లో క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్ కాంట్రాక్టును ప్రైవేటుకు అప్పగించారు. వాటిని ఉచితంగా నిర్వహించాల్సిన సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి డబ్బు వసూలు చేశారు. అధికారులు మాత్రం 7.43 లక్షలకు బిల్లు పెట్టారు.

భవానిపురంలో కనకదుర్గమ్మ పైవంతెన కింద ఏర్పాటు చేసిన పార్కు కోసం దాదాపు 9.45 కోట్లు పైగా ఖర్చు చేశారు. అలాగే వేసవి చలివేంద్రాలకు 14.86 లక్షలకు పైగా ఖర్చు చేశామంటూ బిల్లు పెట్టి ఔరా అనిపించారు. కార్పొరేషన్ అధికారులు ప్రతి వారం జమా ఖర్చులను స్థాయి సంఘం ముందుకు తేవాలి. ఒకవేళ సమావేశం జరక్కపోతే నెక్స్ట్ వీక్ తప్పనిసరి. అయితే చట్టంలోని 50 లక్షల లోపు అనే నిబంధనను, తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు అధికారులు ఖర్చులను ముక్కలు చేసి.. కొన్ని రోజులు, వారాలు, నెలల తర్వాత స్థాయీ సంఘం ముందుకు తెస్తున్నారు.

ద్రవ్య నియంత్రణ కోసం 15 ఏళ్ల క్రితం ఆమోదించిన తీర్మానం ఏమైందో ఎవరికీ తెలీయట్లేదు. పని ఏదైనా స్థాయి సంఘం నుంచి పరిపాలన ఆమోదం పొందాలి. ఆ తర్వాతే టెండర్ ప్రక్రియ అమలు చేయాలి. కాంట్రాక్టర్ నుంచి ఈఎంఐ సొమ్ము డిపాజిట్‌ సేకరించి పనులు అప్పగించాలి. క్షేత్రస్థాయి తనిఖీలు, క్వాలిటీ కంట్రోల్ పరిశోధనలు చేపట్టాలి. ఆ తర్వాతే బిల్లులకు చెల్లింపులు. కానీ.. విజయవాడ కార్పొరేషన్లో టెండర్ ప్రక్రియ పూర్తి భిన్నం. నామినేషన్ పద్ధతిన జరుగుతున్నాయి. అప్పటికప్పుడు అయినవారికి అప్పగించేస్తున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా, ఆలస్యంగా ఆ బిల్లులను స్థాయి సంఘం ముందుకు తెచ్చి ఆమోదముద్ర వేయించుకుంటున్నారు. పొరపాటున పట్టుబడితే ఉన్నతాధికారులకు చెప్పి ఖర్చు చేశామని తప్పించుకుంటున్నారు. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నా నియంత్రణ లేకుండా పోయింది.

Tags

Next Story