ఏసీలోంచి గాలి చల్లగా.. సౌండ్ బుస్ బుస్.. తెరచి చూస్తే..

ఎక్కడో పైన ఉంటుంది.. ఎవరూ ఇప్పట్లో ఇబ్బంది పెట్టరు.. వారికి అనుమానం వస్తే తప్ప.. అయినా ఎందుకు సౌండ్ చేయడం.. హ్యాపీగా పడుకోక. ఏసీలో చల్లగా ఉంటుందనుకుంది.. అలా అనుకుని ఏసీలో సెటిలైపోయింది ఓ పాము. ఎండాకాలం మొదలు ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటున్నారు తమిళనాడు పుదుచ్చేరికి చెందిన ఓ కుటుంబం. ఏసీ ఆన్ చేయగానే ఏదో శబ్ధం వస్తోంది. మెకానిక్‌కి చూపించాలనుకుంటూనే రోజులు గడిపేస్తున్నారు. పొద్దున్న లేస్తే బిజీ లైఫ్. రాత్రవగానే అలసిన శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. ఏసీ వేసుకుని చల్లగా నిద్రపోతున్నారు. రోజు రోజుకి సౌండ్ మరీ ఎక్కువవుతుండడంతో మెకానిక్‌ని పిలవక తప్పని పరిస్థితి. మెకానిక్ వచ్చి ఏసీని విప్పి చూస్తుంటే రెండు పాము కుబుసాలు కనిపించాయి. భయపడుతూనే ఏసీ మొత్తం విప్పి చూశాడు. నిజంగానే అందులో పాము పడుకుని ఉంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమచారం అందించారు. వారు రెండు గంటలపాటు శ్రమించి పాముని బయటకు తీశారు. పాము రెండు అడుగుల పొడవు వుందని తెలియజేశారు. ఏసీకి బయట ఉన్న పైపుని సరిగ్గా మూయకపోవడంతో పాము లోనికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పాముని జాగ్రత్తగా పట్టుకున్న సిబ్బంది తీసుకువెళ్లి అడవిలో వదిలేయడంతో ఇంట్లోని వారు ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com