మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ ను ఆహ్వానించనున్న కేసీఆర్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ ను ఆహ్వానించనున్న కేసీఆర్
X

కాళేశ్వరం‌ ప్రారంభోత్సవాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించనున్నారు కేసీఆర్‌. ఇందుకోసం శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండుగంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానిస్తారు.

గోదావరిపై కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అడ్డంకులు అధిగమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో సరిహద్దుల్లో భూవివాదాలు, ముంపు సమస్యల్లాంటివి పరిష్కరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దిగువ రాష్ట్రం అయినా ఏపీతో కూడా జలసమస్యలు పరిష్కరించుకుని పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్‌ ను కూడా కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్న లక్ష్యంతో అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా రూపుదిద్దుకున్న భారీ సాగునీటి పథకం కాళేశ్వరం. 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అంతరరాష్ట్ర సమస్యలు, భూసేకరణ, పునరావాస సమస్యలు, అనుమతులు, కోర్టు కేసులు ఇలా అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించారు. ఇప్పటికి 50 వేల కోట్లు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ప్రాణహిత నది గోదావరితో కలిసిన తర్వాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారు. ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ తరహాలో ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కి నీటిని మళ్లించేలా డిజైన్ చేశారు.

కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపట్టారు. నీటిని ఎత్తిపోసేందుకు 3 లిప్టుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ కల్లా పనులు పూర్తి చేయాలని.. పొలాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టే వేగంగా పనులు పూర్తి చేయించింది.

Tags

Next Story