మరో కీలక పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్!
ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ వ్యూహకర్తగా పేరు సంపాదించారు. అదృష్టమేమోగాని ఆయన సేవలందించిన ప్రతి పార్టీ అధికారంలోకి వస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా సేవలందించి గ్రాండ్ సక్సెస్ సాధించారు. ఆ తరువాత బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేడీకి పనిచేశారు.. దాంతో అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అయితే 2017 లో ఆయన వ్యూహాలు మాత్రం బెడిసికొట్టాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరించారు కానీ అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ ద్వయం మట్టికరిచింది. దీంతో ప్రశాంత్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.. కానీ ప్రశాంత్ మాత్రం ఏపీలో ప్రవేశించాడు. వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి సంచలన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో అడుగుపెట్టాడు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో తృణమూల్ పార్టీ గట్టి పోటీ ఎదుర్కొంది. బీజేపీ ఏకంగా 18 సీట్లు గెలవడంతో మమతా దీదీ పరిస్థితిని చక్క దిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తయింది. అయితే బెంగాల్ తోపాటుగా మరో పార్టీ కూడా ప్రశాంత్ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోందట.. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరుపుతోందట. అతని ఐప్యాక్ టీమ్ లోని డైరెక్టర్లు రిషిరాజ్ సింగ్, వినేశ్ చందల్ శుక్రవారం సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామితో సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో 2021 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాల్లో విజయ డంకా మోగించింది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మాత్రం ఘోరంగా దెబ్బతింది. గతంలో 33 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటుకూ మాత్రమే పరిమితమైంది.. దీంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలయింది. ఇలాఐతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారట.. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గనక ఒకే అయితే దక్షిణాదిలో రెండో ప్రాంతీయ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటున్న జాబితాలో చేరుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com