క్రైమ్

విషాదంగా మారిన ప్రేమ జంట దాడి ఘటన

విషాదంగా మారిన ప్రేమ జంట దాడి ఘటన
X

హైదరాబాద్‌లో ప్రేమ జంట దాడి చేసిన ఘటన విషాదంగా ముగిసింది. ప్రేమ జంట దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయి సాగర్‌ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

రెండు రోజుల క్రితం సాయి సాగర్‌... తన స్నేహితుడి బర్త్‌డే వేడుకలు జరుపుకునేందుకు నెక్లెస్‌ రోడ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో నెక్లెస్‌రోడ్‌లో జలవిహార్ దగ్గర కారులో మోబిన్‌ అనే వ్యక్తి తన గర్ల్‌ ఫ్రెండ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన సాయి.. ఇది పద్దతి కాదంటూ వారిద్దరిని మందలించాడు. దీంతో ప్రియురాలి ముందు తనకు అవమానం జరిగిందని భావించిన మోబిన్‌ ఆవేశంతో రగిలిపోయాడు. సాయితో పాటు అతని స్నేహితులపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతూ సాయి ప్రాణాలు కోల్పోయాడు.

20 రోజుల క్రితమే సాయిసాగర్‌కు వివాహం అయ్యింది. ఇంతలోనే హత్యకు గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

సాయిని హత్య చేసిన నిందితుడు మోబిన్‌పై మిర్యాలగూడలో 16 కేసులు ఉన్నాయి. పీడియాక్ట్‌ కేసు కూడా ఉంది. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు చెబుతన్నారు.

సాయి హత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల నిర్లక్ష్యమే సాయి హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితున్ని తమకు అప్పగిస్తే కఠిన శిక్ష విధిస్తామని అంటున్నారు.

Next Story

RELATED STORIES