కలిసుందామన్నాడు.. కాదనేసరికి..
తనకిష్టమైతే చాలనుకున్నాడు. ఆమె ఇష్టా ఇష్టాలతో పనిలేదనుకున్నాడు. ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. కలిసి కాపురం చేద్దామన్నాడు. అందుకు ఒప్పుకోకపోయేసరికి ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన విరాజ్ పేట్ తాలూకాలోని బాళలె గ్రామానికి చెందిన ఆశా కావేరి అని 50 ఏళ్ల టీచర్ ఓ పాఠశాలలో పని చేస్తోంది. ఒంటరిగా జీవిస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన జగదీష్ అనే 60 ఏళ్ల వృద్ధుడు కొంతకాలంగా గమనిస్తున్నాడు. రోజూ స్కూలుకు వెళ్లేందుకు బస్టాప్‌కి వచ్చిన టీచర్‌తో మాటలు కలిపేవాడు. మొదట మంచిగానే మాట్లాడుతుంటే మంచి వ్యక్తే అనుకుంది ఆశా.
అతడి మనసులోని దుర్భుద్దిని పసిగట్టలేకపోయింది. రోజులానే ఓ రోజు వచ్చి ఆమెతో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇద్దరం ఒంటరిగా ఉన్నాం సహజీవనం చేద్దామని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన జగదీష్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి సమీపంలోని కాఫీ తోటలోకి వెళ్లి తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రెండేళ్లుగా టీచర్ వెంట పడి వేధిస్తున్నాడని, ఆమె సహజీవనానికి ఒప్పుకోనందుకే హత్యచేశాడని గాయపడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com