ఆయన చిటికెన వేలు పట్టుకుని..

ఆయన చిటికెన వేలు పట్టుకుని..

నాన్నంటే నడిచే దైవం. జన్మనిచ్చిన తల్లి గొప్పతనం ఒక వైపు ఐతే...కష్టాలంటే ఏంటో తెలియకుండా పెంచే నాన్న గొప్పతనం మరో వైపు. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ కులమైనా, ఏ మతమైనా ఏ ప్రాంతమైనా, ప్రతి తండ్రి బతికేది తమ పిల్లల భవిష్యత్తు కోసమే. అందుకోసం ఎంతైనా కష్టపడతాడు.. ఎంత దూరమైనా వెళ్తాడు. తప్పటడుగులు వేస్తే.. ఆ బిడ్డని సరిచేసి సరికొత్తగా లోకానికి పరిచయం చేస్తాడు తండ్రి. ఇవాళ నాన్నల రోజు.. ఈ సందర్భంగా ప్రతి తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ.. నాన్నల త్యాగాలను ఓ సారి గుర్తు చేసుకుందాం..

తల్లిదండ్రులను, జీవన సహచరులను, ఇతర బంధుత్వాలను ప్రేమించడానికి ఒక ప్రత్యేక దినం అవసరముందా అని చాలా మంది అంటుంటారు కొందరు.. కానీ మానవ సంబంధాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కనీసం ఈ రోజైనా నాన్న గొప్పతనాన్ని స్మరించుకోవడంలో తప్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అవసరం కూడా..

నాన్నంటే నీలాకాశం .. తల వంచేనా అంటాడో సినీ కవి.. అలా తలవంచని నాన్నే మన హీరో. ఆయన ఏం చేసినా పిల్లలకు అందులో హీరోయిజమే కనిపిస్తుంది. ఆయన చిటికెన వేలు పట్టుకుని.. లోకాన్ని చూపిస్తూ.. కుటుంబంతో కలిసి ఆ బిడ్డకు అన్నీ తానైపోతాడు.

బ్రహ్మ తను అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు.. అలాంటి బ్రహ్మకు అమ్మకు మధ్యన నాన్న ఓ నిచ్చెనలాగా మారి.. మనల్ని, సరైన దారిలో నడిపే వారథిలా నిలుస్తాడు. మనకోసం అమ్మ కన్నీళ్లు రాలిస్తే.. ఆ కన్నీళ్లను దాచుకున్న నాన్న వాటిని మనకోసం చెమట చుక్కలుగా మార్చి కరిగిస్తాడు..

చాలామంది నాన్నలు తమ కలలకు అనుగుణంగా బిడ్డల్ని పెంచాలనుకుంటారు.. ఇంకొందరు నాన్నలు బిడ్డల కలలకు అనుగుణంగా వారికి అన్నీతామైపోతారు.. ఎవరు ఏం చేసినా ఎదిగిన కొడుకు కళ్లముందున్నప్పుడు నాన్న కూడా పిల్లాడైపోతాడు.. అప్పటి వరకూ గంభీరంగా కనిపించిన నాన్నే కొడుకు ప్రయోజకుడైన తర్వాత వారి కోసం పడ్డ కష్టాన్నంతా మర్చిపోతాడు..

ఒక్కోసారి పిల్లలపై ప్రేమ ఎక్కువైనా ఇబ్బంది తప్పదు. నాన్న చూపించే ప్రేమ.. పిల్లల అభిప్రాయాలకు, అభిరుచులకు దగ్గరగా ఉండాలి. లేదంటే.. ఆయన బిడ్డ మనసనే కోర్టులో దోషిలా నిలబడతాడు.. అలాంటి సందర్భాలు ప్రతి తండ్రికి ఏదో ఒక దశలో ఎదురవుతాయి.. అయినా బిడ్డల మనసు తెలుసుకుని మసలుకుంటే ఆయనకు మించిన హీరో ఇంకెవరుంటారా పిల్లలకి...

నిజానికి అమ్మే లోకమనుకునే పిల్లలు ఎక్కువమందేం ఉండరు.. ఇంట్లో అమ్మ రూల్స్ పెడితే, ఆ రూల్స్ ను నాన్న సహాయంతోనే బ్రేక్ చేస్తారు పిల్లలు. అమ్మ ఏదైనా అంటే చాలు.. నాన్నతో చెబుతా అంటూ బెదిరిస్తారు కూడా.. నాన్నంటే అంత ఇష్టం.. అలాగే అమ్మ లాలి పాడితే నాన్న జోల పాడతాడు.. బిడ్డ కోసం ఆ తండ్రి అన్ని రాగాలూ కూర్చి తన చిట్టితల్లిని కునుకుల దేవి ఒడిలో చేర్చుతాడు..

ఒక్కోసారి తండ్రులకు వారి తండ్రుల నుంచి వింత అనుభవాలు ఎదురవుతాయి. వారు చేస్తున్న ఉద్యోగాల వల్లో లేక ఎదుర్కొన్న పరిస్థితులో వారిని ఓ చట్రంలో ఉండేలా చేస్తాయి.. పిల్లల ఇష్టాలను పూర్తిగా తెలుసుకోకండా తమ ఇష్టాలనే వారిపై రుద్దుతారు.. అలాంటి అనుభవాలున్న తండ్రులు తమ పిల్లలకు ఆ కథలను కూడా ఆనందంగానే చెబుతారు..

ఆడపిల్లలకు తండ్రి ఇచ్చే బలం కొండంత.. అంత బలాన్ని, భరోసాను తల్లి ఇవ్వలేదనేది వాస్తవం. ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇచ్చే స్థైర్యం వారి ఆత్మ విశ్వాసాన్ని కొండంతలు చేస్తుంది.. ఇక ఆ తండ్రికీ ఆ కూతురంటే అంతులేని అభిమానం ఉంటే ఆ బంధం ఆకాశమంతై అల్లుకోదూ.

నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుందంటారు.. నిజమే.. ఆ గుండె లోతుల్ని తడమగలిగే కొడుకులకు మాత్రమే అది అర్థమౌతుంది. అంతే కాదు.. నాన్నంటే గౌరవం లేని కొడుకులుంటారేమో కానీ, కొడుకంటే ఇష్టంలేని తండ్రులుండరు.. ఒకవేళ ఆ తండ్రి, కొడుకుల మధ్య అర్థం చేసుకునేంత గౌరవం, ప్రేమ ఉంటే.. కోట్లు విలువ చేసే ఆస్తి కొడుకే అని తండ్రి, తండ్రి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదని కొడుకూ అనుకోకుండా ఉంటారా..?

ప్రతి తండ్రీ టీనేజ్ వయసును దాటి వచ్చిన వాడే. ఆ వయసులో వేసే అడుగులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి అడుగే తన కొడుకూ వేశాడని తెలిస్తే ఆయన తల్లడిల్లిపోతాడు.. కానీ కొందరు తండ్రులు మాత్రమే ఆ క్షణం నుంచి ప్రేమలో పడ్డాడనుకుంటోన్న తన కొడుకును మరింత ప్రేమించడం మొదలుపెడతాడు.. అంటే దానర్థం.. అతను తన బాధ్యతను స్పష్టంగా తెలిసిన వాడని..

నాన్నంటే, ప్రేమ రూపమే కావచ్చు.. బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో... నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి. పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు నాన్న. వారు మారకపోయినా.. వారి వల్ల సమాజానికి హాని జరుగుతుందని తెలిసినా.. ఒక్కోసారి నాన్నలు కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.. తీసుకోవాలి కూడా..

Tags

Read MoreRead Less
Next Story