వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జనంలో ఆందోళన

వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జనంలో ఆందోళన

నైరుతి ఆలస్యం అవుతోంది. చినుకు జాడ పత్తా లేదు. అటు రుతు రాగాలు వెక్కిరిస్తుంటే...ఇంటు మండే ఎండలు జనాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. రోహిణి కార్తె ముగిసిపోయింది. అయినా రోళ్లు మాత్రం పగులుతూనే ఉన్నాయి. జూన్‌ 15 దాటినా.. ఇంకా అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు వెళితే చాలు భానుడు మాడు పగలగొట్టేస్తున్నాడు. అంతే కాదు మరో మూడు, నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జనం మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం ఏడు దాటితే చాలు ఎండలు తాండవం చేస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. పగటి ఉష్ణోగ్రతలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. జనం బయటకు రావాలంటేనే బయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇంకా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం ఆందోళన కలిగించే అంశం.

ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి జల్లులతో తడిసి ముద్దవ్వాల్సిన సమయంలో వేడిగాలులతో జనం ఉడికిపోతున్నారు. శనివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా బొండపల్లిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 45 డిగ్రీలు, దేవ‌ర‌ప‌ల్లిలో 45 డిగ్రీలు, ఉంగ‌టూరులో 45 డిగ్రీ, తునిలో 44 డిగ్రీలు, విశాఖలో 44, మచిలీపట్నంలో 43, బాపట్లలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో ఉక్కపోత కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి విస్తరించకపోవడం...పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వేడి గాలులు రాష్ట్రంపైకి రావడంతో కోస్తా అగ్నిగుండంగా మారిపోయింది. కోస్తా జిల్లాల్లో మరో రెండుజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఇటు తెలంగాణలోనూ సూర్యుడు కాక పుట్టిస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఎండల్లో పని చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్‌ రోడ్లపై తిరిగేందుకు నగరవాసులు వెనుకంజ వేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అటు స్కూళ్లకు వెళ్లే పిల్లలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఎండ తీవ్రతల దృష్ట్యా కొన్ని స్కూళ్లు ఒంటిపూట బడులనే నిర్వహించే పరిస్థితి ఏర్పడుతోంది.

మృగశిర కార్తె ప్రవేశిస్తే వాతావరణ చల్లబడుతుందని అందరూ ఆశించారు. కానీ అది జరగలేదు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గకపోగా.. మరింత పెరగడం ఇబ్బందిగా మారింది. ఇది భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపి తాగు నీరు, సాగునీటి కొరతకు దారి తీస్తోంది

మరోవైపు వరుణుడి రాక ఆలస్యంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని సాగుకు భూమిని సిద్ధం చేసి పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు చినుకు పలకరించకపోవడంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాలు కేరళ దాటినా ఇంకా అక్కడే ఉన్నాయి. మరో 2, 3 రోజుల్లో కర్ణాటకలో విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నా... ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో... జూన్‌లో 60 నుంచి 70 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వెల్లడించింది. జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణం కంటే 60 నుంచి 70 శాతం అధికంగా వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది కాలం అవుతుందా కాదా? పంటలు పండుతాయా లేదా అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.

Tags

Next Story