క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆందోళన..కనీసం టీ ట్వంటీ మ్యాచ్ అయినా జరగాలని..

వరల్డ్‌కప్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చే పోరు మరికొద్ది గంటల్లో మొదలుకాబోతోంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఇండో-పాక్ పోరులో బలాబలాల పరంగా టీమిండియానే ఫేవరెట్. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. వెరసి మాంచెస్టర్ వేదికగా ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ కాని ఫైనల్‌కు సిధ్ధమైంది. అదేంటి టోర్నీ ఇంకా లీగ్ స్టేజ్‌లోనే ఉండగా... ఈ ఫైనల్ గొడవ ఏంటనుకుంటున్నారా... మరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అంతే మరి. ఎప్పుడు పాక్‌తో పోరు జరిగినా... ఇరు జట్లకూ అదొక యుధ్ధం.. మ్యాచ్‌కు మించి... ఆట కంటే ఎక్కువగా భావోద్వేగాల సమరం... మాంచెస్టర్ వేదికగా జరగబోయే ఈ క్రేజీయెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఫామ్ , బలాబలాల పరంగానే కాదు రికార్డుల పరంగానూ కోహ్లీసేనదే పైచేయిగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభం నుండీ టైటిల్ ఫేవరెట్స్‌గా స్థాయికి తగిన ఆటతీరుతో దూసుకెళుతోన్న టీమిండియా వరుసగా రెండు విజయాలతో జోరు మీదుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవడం కాస్త నిరాశ కలిగించినా... సూపర్ సండే పోరులో మాత్రం పాక్‌ను ఓడించి సెమీస్ రేసులో ముందడుగు వేయాలని ఉవ్విళ్ళూరుతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో దూరమవడం ఎదురుదెబ్బగానే భావించినా... కెఎల్ రాహుల్ రూపంలో రీప్లేస్మెంట్ ఉండడం ఎటువంటి ఇబ్బందీ లేదు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక టీమిండియా బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ, కోహ్లీలతో పాటు ధోనీ, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాలపై అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లో మన పేస్కే కాదూ... స్పిన్‌కూ తిరుగులేనట్టే...గత రెండు మ్యాచ్‌లలో సమిష్టిగా రాణించిన బౌలర్లు పాక్‌పైనా చెలరేగితే మూడో విజయం దక్కినట్టే.
మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు పరాజయాలతో డీలాపడిన పాకిస్థాన్ పూర్తి ఒత్తిడిలో కనిపిస్తోంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకున్నా ప్రమాదమే. పైగా భారత్‌తో మ్యాచ్ అంటే ఆ జట్టు కూడా చివరి వరకూ పోరాడే అవకాశాలుంటాయి. బ్యాటింగ్‌లో బాబర్ అజామ్, ఫకర్ జమాన్, షోయబ్ మాలిక్‌లపై పాక్ ఆశలు పెట్టుకుంది. అటు బౌలింగ్‌లో మాత్రం పేసర్ మహ్మద్ అమీర్, సీనియర్ బౌలర్ వాహబ్ రియాజ్ ఫామ్‌లో ఉన్నారు. చివరి నిమిషంలో చోటు దక్కించుకున్నఅమీర్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తుండడం పాక్‌కు అడ్వాంటేజ్. మరి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను కట్టడి చేయాలంటే పాక్ బౌలర్లు అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా భారత్‌పై గెలవని పాకిస్థాన్‌కు ఈసారి కూడా భంగపాటు తప్పదని భావిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ముప్పు పొంచి ఉండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే పూర్తిస్థాయిలో కాకున్నా ఓవర్ల కుదింపుతో కనీసం టీ ట్వంటీ మ్యాచ్ అయినా జరగాలని కోరుకుంటున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com