జగన్ ఆవేదన.. ఆ విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేస్తున్న..

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్‌. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చే విషయంలో పెద్దమనసుతో వ్యవహరించాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు. హైదరాబాద్‌లోనే ఐటీ సెక్టార్‌ ఉండడంతో ఏపీ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలతోనే రాష్ట్రం ముందుకు పోతుందని.. అది ప్రత్యేక హోదానే సాధ్యమవుతుందని నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌ స్పష్టం చేశారు.

ఆర్థిక కష్టాల నుంచి ఏపీ గట్టెక్కడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడంతప్పనిసరి అని జగన్‌ అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న జగన్‌ హోదాపైనే అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయని. కానీ ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఉన్న 97 వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని.. ఈ ఐదేళ్లలో 2,58,928 రూపాయల కోట్లకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అప్పులకు ఏటా 20 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఇది కాకుండా అసలు మరో 20 వేల రూపాయల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు.

ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని జగన్‌ చెప్పారు. హోదా ఇస్తే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని. జీఎస్టీకి సంబంధించిన రాయితీలూ, ప్రత్యేక పారిశ్రామిక రాయితీలూ అందుతాయని, వేగంగా పారిశ్రామికరణ జరగడానికీ, ఉపాధి అవకాశాలు పెరగడానికీ ఇదంతా దోహదం చేస్తుందన్నారు.2014 ఎన్నికల భాజపా మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రధాని ప్రకటించారన్నారు .

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ డిమాండ్‌ చేస్తాయని ప్రచారం జరుగుతోందని, కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను ఈ షరతుతోనే విభజించారనేది గుర్తుపెట్టుకోవాలని జగన్‌ కోరారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తలసరి 5573 రూపాయల గ్రాంటుగా వస్తుంటే.. ఏపీకి తలసరి 3428 రూపాయల గ్రాంటుగా వస్తున్నాయని జగన్‌ నివేదికలు ఇచ్చారు.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోరని వదంతులు వచ్చాయని. వాటి గురించి విన్నప్పుడు బాధగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా వ్యవస్థను రద్దు చేయాలని తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ స్పష్టంగా చెప్పారని సీఎం వ్యాఖ్యానించారు. హోదా రద్దుకు సిఫారసు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు అభిజిత్‌ సేన్‌ ఈ-మెయిల్‌ ద్వారా రాసిన కాపీని తన ప్రసంగ పత్రానికి ఆయన జతపరిచారు. అప్పటి కేబినెట్‌ నోట్‌ను కూడా జగన్‌ ప్రసంగ పత్రానికి జతపరిచారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చే విషయంలో పెద్దమనసుతో వ్యవహరించాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థించారు.

Tags

Next Story