అమ్మకోసం మట్టిని తడుముతూ.. ఆకలితో పసిబిడ్డ.. వీడియో వైరల్

అమ్మకోసం మట్టిని తడుముతూ.. ఆకలితో పసిబిడ్డ.. వీడియో వైరల్

అమ్మకోసం, ఆకలి తీర్చే అమ్మ పాల కోసం మట్టిలో వెతుకుతోంది. శరీరం పైన చిన్న బట్ట అయినా చుట్టకుండా వదిలేసి వెళ్లిన ఆ తల్లి అంత నిర్దయగా అలా ఎలా వదిలి వెళ్లింది. తప్పేమైనా చేసి తప్పటగులు వేసి నవమాసాలు మోసి బిడ్డను కందేమో. మూడో కంటికి తెలియకుండా మట్టిలో పూడ్చాలనుకుందేమో. కానీ మనసు రాక దయగల మహరాజులు ఎవరైనా బిడ్డని అక్కున చేర్చుకుంటారని తలచినట్లుంది. కనులైనా తెరవని ఆ పసిగుడ్డుని అలా వదిలేసి వెళ్లి పోయింది. రాజస్తాన్‌లో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యం మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేస్తుంది. ఓ వ్యక్తి కంటపడ్డ ఈ పసిగుడ్డు.. అమ్మ కోసం వెతుకుతూ.. పాలకోసం పసిబిడ్డ పడుతున్న తపనని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరూ చూసి అయ్యో పాపం అంటే.. దర్శకుడు, జర్నలిస్ట్ అయిన వినోద్ కప్రీ, ఆయన భార్య న్యూస్ యాంకర్ కూడా అయిన సాక్షి జోషి‌లు మాత్రం ఆ బిడ్డని మేం దత్తత తీసుకుంటాం.. అమ్మానాన్న అవుతాం అంటూ ముందుకొచ్చారు. బిడ్డ ఆచూకీ తెలపాలంటూ ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవలే వచ్చిన పీహూ చిత్ర దర్శకుడు వినోద్ కప్రీ. ఈ సినిమా కూడా రెండేళ్ల చిన్నారి చుట్టూనే తిరుగుతుంది. తండ్రి ఇంట్లో లేని సమయంలో పీహూ తల్లి నిద్రలోనే చనిపోతుంది. ఆ విషయం తెలియని చిన్నారి అమ్మ నిద్రపోతుందని భావిస్తుంది. అమ్మని లేపుతూ, ఆ చిన్నారి ఎదుర్కునే విపత్కర పరిస్థితులను వినోద్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలను అందుకుంది పీహూ చిత్రం. ఇక వీడియోలో చూసిన చిన్నారికి పీహూ అని పేరు పెట్టి దత్తత తీసుకుంటున్నామని ప్రకటించారు. అందుకోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఆ జంటను ప్రశంసిస్తున్నారు. #PrayForPihu అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు చిన్నారి ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story