ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టారు. మండలి సమావేశం సందర్భంగా ఆయన సభలోకి రాగా.. సభ్యులంతా గౌరవసూచకంగా నిలబడి స్వాగతం పలికారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్, టీడీపీ ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడితో పాటు సభ్యులందరికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ కొనసాగింది.
ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాస రావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్లుగా చంద్రబాబు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే సభలో తలవంచుకుని నిలబడ తానంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com