లోక్‌సభ స్పీకర్‌గా ఆ మహిళా నేత!

లోక్‌సభ స్పీకర్‌గా ఆ మహిళా నేత!

17వ లోక్‌సభ ఇవాళ కొలువు దీరనుంది. ఇవాల్టి నుంచి జులై 26వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్రంలో మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్, కొత్త ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. జూన్ 19న లోక్‌సభ కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

సుమిత్రా మహాజన్ స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడుతారో ఆ రోజు తేలిపోనుంది. ఈ సారి కూడా మహిళా స్పీకర్‌ను ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ ఎంపీ మేనకాగాంధీ స్పీకర్‌గా ఎన్నిక కావచ్చొంటున్నారు. జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.

నిజానికి ఏటా ఫిబ్రవరిలోవార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్ కు సమర్పిస్తారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరినందున పూర్తి స్థాయి పద్దుల లెక్కను సమర్పించనున్నారు. జూలై 5న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, దేశ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ కు సమర్పిస్తారు. విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. కరవు, వ్యవసాయరంగ సంక్షోభం, నిరుద్యోగం-ఉపాధి కల్పనలపై బడ్జెట్‌లో ఫోకస్ చేయనున్నారు. రియల్ ఎస్టేట్, మౌలిక, నిర్మాణ రంగాలకు పెద్ద పీట వేయనున్నారు. చిన్న తరహా పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియాకు కేటాయింపులు పెంచే అవకాశముంది..

17వ లోక్‌సభ తొలి సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆధార్ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాఖ్ బిల్లులు మరోసారి పార్లమెంట్‌ ముందుకు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్ప మిగతావాటికి ఆధార్‌ వినియోగాన్ని స్వచ్చందం చేస్తూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనులకు ఆధార్‌ వినియోగం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లులో మార్పులు చేసింది. ఆ సవరణ బిల్లును పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ట్రిపుల్ తలాఖ్ బిల్లు గతంలో లోక్ సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో అడ్డుపుల్ల పడింది. ఐతే ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. రెండోసారి అధికారం కైవసం చేసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ట్రిపుల్ తలాఖ్‌ బిల్లుపై చర్చించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి బిల్లును మళ్లీ పార్లమెంట్‌కు తీసుకొస్తున్నారు..

ఈసారి కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే లోక్‌సభ సాగనుంది. కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే రావడంతో వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదాకు దూరమైంది. ఇక ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, హెచ్‌డీ దేవేగౌడ లేకుండానే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేవగౌడ ఓడిపోగా... రాజ్యసభసభ్యుడైన మన్మోహన్‌సింగ్‌ పదవికాలం ముగిసిపోయింది. ఇక బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌జోషి, సుష్మాస్వరాజ్‌, ఉమాభారతి లాంటి వారు పోటీ చేయలేదు. లోక్‌సభ విపక్షనేతగా ఉన్న మల్లికార్జు కర్గే, ఉపనేతగా ఉన్న జ్యోతిరాధిత్య సిందియా సైతం ఓడిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story