ఒక్కరోజులోనే బఫూన్‌గా మారిపోయిన సర్ఫరాజ్

క్రికెట్ లో ఏ టీమ్ కైనా కెప్టెన్ గా ఉండటం గొప్ప అవకాశం. అందులోను ప్రపంచకప్ జట్టుకు నాయకత్వం వహించడం ఎవరికైనా డ్రీమ్. ఆ ఛాన్స్ కోసం కలలు కంటారు. కానీ పాక్ జట్టుకు సారథిగా వ్యవహరించడం కత్తిమీద సామే! ఈవిషయం సర్ఫరాజ్ అహ్మద్ కు ఇప్పటికే అర్థమైపోయింది. టీమిండియా చేతిలో ఏదురైన ఘోర పరాజయానికి అతన్ని చీల్చిచెండాడుతున్నారు.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే మాటలు కాదు. మైదానంలో జరిగే యుద్ధం అది. మ్యాచ్ చూసే ప్రతి అభిమాని తాము కూడా ఆడుతున్నట్లుగానే అందులో లీనమైపోతారు. కేవలం రెండు దేశాలే కాదు యావత్ ప్రపంచమూ ఈ వార్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఇండియా-పాక్ మ్యాచ్ కు అంతటి ఇంపార్టెన్స్.
ఇలాంటి మ్యాచ్ లో ఆడుతున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. బాగా ఆడితే ఒక్క రాత్రిలోనే హీరో అయిపోతారు. లేదంటే అండర్ గ్రౌండ్ కి తొక్కేస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అతన్ని ఏకిపారేస్తున్నారు ఫ్యాన్స్. రకరకాల మీమ్స్ తో కసి తీర్చుకుంటున్నారు. ఇంకొందరైతే నోటికి పనిచేబుతున్నారు. బండబూతులు తిడుతున్నారు.
ఇండియాతో మ్యాచ్ లో సర్ఫరాజ్ చేసిన ఒక్కో మిస్టేక్ ను తవ్వి తీస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా మ్యాచ్ ఎండింగ్ లో సర్ఫరాజ్ ఆవలింతలు తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అసలే హై ఓల్టేజ్ మ్యాచ్. వరల్డ్ కప్ లో ఇండియాపై గెలిచిన చరిత్రే లేదు. పైగా భారత బ్యాట్స్ మెన్ ఉతికారేస్తున్నారు. అలాంటి సమయంలో సర్ఫరాజ్ ఫేస్ లో ఎలాంటి టెన్షన్ కనపడలేదు. పైగా నిద్ర ముఖం. ఆవలింతలు. చాలా నిర్లక్ష్యంగా కనిపించాడు. దీంతో సర్ఫరాజ్ కెప్టెన్ గానే పనికిరాడంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
కీలకమైన టాస్ గెలిచినప్పటికీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సర్ఫరాజ్. అక్కడే పాక్ ఓటమి ఖాయమైపోయింది. బ్యాటింగ్ పిచ్ పై మనోళ్లు చెలరేగిపోయారు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ తీసుకున్నాడంటే సర్ఫరాజ్‌ది నిజంగా బ్రెయిన్‌లెస్ కెప్టెన్సీ అంటూ విరుచుకుపడ్డాడు పాకిస్థాన్ వెటరన్ బౌలర్ షోయబ్ అక్తర్. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగే చేయాలని ట్వీట్ చేశాడు. ప్రధాని చెప్పినా విన్లేదంటూ మరింత ఫైర్ అవుతున్నారు. వెదర్ కండీషన్స్ దృష్టిలో పెట్టుకొని సర్ఫరాజ్ ఫీల్డింగ్ వైపు మొగ్గాడనే విషయాన్ని.. తొలి ఓవర్ మెయిడెన్ అనే నిజాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. ఇతనేం కెప్టెన్ అంటూ విమర్శిస్తున్నారు.
మొత్తానికి పాకిస్తాన్ ఘోర పరాజయం కారణంగా ఒక్కరోజులోనే సర్ఫరాజ్ అహ్మద్ బఫూన్ గా మారిపోయాడు. ఫాక్ ఫ్యాన్స్ అతడిని చీల్చి చెండాడుతున్నారు. ఆదివారం రాత్రి పాకిస్థాన్ లో పగిలిపోయిన టీవీలకైతే లెక్కే లేదట.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com