ఊహించిందే జరిగింది...

ఊహించిందే జరిగింది...

బలాన్ని మరింత పెంచుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.. ఇందులో భాగంగానే వ్యూహకర్త జేపీ నడ్డాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.. బీజేపీలో ఎప్పుడూ కనిపించని, వినిపించని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని నడ్డాకు కట్టబెట్టింది. ఇంతకూ నడ్డా యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోంది..? కొత్త రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు..?

ఊహించిందే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు జేపీ నడ్డాకు ప్రమోషన్ లభించింది. నడ్డాను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల పాటు నడ్డా ఈ పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. జేపీ నడ్డా వెంటనే బాధ్యతలు స్వీకరించినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడ్డా.. గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన పూర్తి పేరు జగత్ ప్రకాష్ నడ్డా. 1960 డిసెంబర్ 2న బిహార్‌లోని పాట్నాలో జన్మించిన నడ్డా, 90వ దశకం నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1993, 1997, 2007లలో హిమాచల్‌ప్రదేశ్ శాసనసభకు ఎన్నిక అయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా పని చేశారు. ఎన్నికల వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడంలో దిట్టగా, ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ నేతలందరిలోనూ తలలో నాలుకలా వ్యవహరిస్తారని నడ్డాకు పేరుంది. జేపీ నడ్డాను బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. నడ్డా సారథ్యంలో కొత్త రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణాదిలో పాగా వేస్తాయన్న ధీమా కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.

former Union minister J P Nadda with party's national office bearers (Photo: PTI)

మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షానే కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ నాటికే ముగిసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా పదవీ కాలాన్ని పొడిగించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి రావడం, మోదీ సర్కారులో కేంద్ర హోంమంత్రిగా షా బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా కేంద్రమంత్రి కావడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున, అప్పటి వరకు అమిత్ షానే పార్టీ అధ్యక్షునిగా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే షా వారసునిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడింది. తర్జన భర్జనల తర్వాత సీనియర్ నాయకుడు జేపీ నడ్డావైపు మొగ్గు చూపారు.

కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన JP నడ్డాకు బీజేపీ నాయకత్వం అభినందనలు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ పార్లమెం టరీ బోర్డు సభ్యులు, నడ్డాను అభినందించారు. ఇక తెలుగు ప్రజల తరపున జేపీ నడ్డాకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. నడ్డా నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అటు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డాకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా నడ్డాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆరు నెలల పాటు జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారు. అధ్యక్ష బాధ్యతల నుంచి షా తప్పుకున్న తర్వాత నడ్డాను ఆ పదవిలో నియమించనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story