ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుడ్ న్యూస్. పోలీసు శాఖలో దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన వీక్లీ ఆఫ్ అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలులోకి రాబోతున్నాయి. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి వరకు ఇక నుంచి వీక్లీ ఆఫ్ లు తీసుకోవచ్చు.
ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో తెలియదు..ఎక్కడ ఏం జరిగినా పోలీసులు అక్కడ ఉండాల్సిందే. వీఐపీలు వచ్చినా..మీటింగ్ జరిగినా..గొడవలు, పండగలు, జాతరలు ఇలా ప్రతీ చోటీ పోలీసులు ఉండాల్సిందే. దీంతో పోలీసు శాఖలో సెలవులు గగనమే. ఇక వీక్లీ ఆఫ్ కు అస్కారమే లేదు. అయితే..తమకు కూడా అందరి ఉద్యోగుల్లాగే వారాంతపు సెలవులు కావాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు పోలీసులు. ప్రభుత్వాలు మారాయి..దశాబ్దాలు గడిచాయి కానీ..పోలీసులకు వీక్లీ ఆఫ్ లు మాత్రం కలగానే మిగిలిపోయాయి. కానీ, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చిరకాల వాంఛ తీరబోతోంది. బుధవారం నుంచి పోలీసు శాఖలో కూడా వీక్లీ ఆఫ్ లు అమల్లోకి వస్తున్నాయి.
పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దీని సాధ్యాసాధ్యాలపై వేసిన కమిటీ రిపోర్ట్ ఇవ్వటంతో డీజీపీ గౌతమ్ సవాంగ్.. పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం నేతలతో సమావేశం అయ్యారు. వీక్లీ ఆఫ్ అమలు తీరుపై చర్చించారు. వారాంతపు సెలవుల అమలుకు మొత్తం 19 మోడల్స్ ఎంపిక చేశామని.. యూనిట్ ఆఫీసర్లు ఎదో ఒక మోడల్ ని సెలక్ట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. వీక్లీ ఆఫ్ లతో పాటు షిప్ట్ లు కూడా ఉంటాయని అన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి వరకు ఇక నుంచి వీక్లీ ఆఫ్ లు ఉంటాయి. ఇప్పటికే విశాఖ, కడప, ప్రకాశం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఏళ్లకు ఏళ్లుగా అమలుకు నోచుకొని వీక్లీ ఆఫ్ లను ఎట్టకేలకు అమలులోకి రాబోతుండటంతో పోలీసు అధికారుల సంఘం నేతలు సంతోషం వ్యక్తం చేశాయి. ఏపీ సీఎం జగన్, డీజీపీ సవాంగ్ కు రుణపడి ఉంటామని సంఘం నేతలు అంటున్నారు. పోలీసు శాఖలో ఇప్పటికే 12 వేల 300 ఖాళీలు ఉన్నాయి. వీక్లీ ఆఫ్ లు ఇస్తే సిబ్బంది కొరత సమస్య మరింత పెరుగనుంది. అయితే.. సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. వీఐపీ, యాంటీ నక్సల్ డ్యూటీ కోసం హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని కూడా వాడుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో వీలైనంత త్వరలో డిపార్ట్ మెంట్లోని ఖాళీలను భర్తీ చేస్తామని అంటున్నారు. అలాగే వీఆర్ లో ఉన్నవాళ్లను, పనిష్మెంట్లు తీసుకున్న వారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వారాంతపు సెలవులపై ప్రతీ రెండు నెలలకు ఫీడ్ బ్యాక్ తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామని చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com