అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్‌ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆర్కేకు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అందుకు ధన్యవాదాలు చెప్తూ ఆర్కే కూడా లోకేష్‌ను పలకరించారు. ఆ తర్వాత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సందర్భంలో ఎమ్మెల్యే ఆర్కే రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణం పనులు ఆగిన విషయం తనకు తెలియదని.. ఎందుకు ఆపేశారో కాంట్రాక్టర్లే సమాధానం చెప్పాలని అన్నారు. ఏదైనా అంశంపై కాంట్రాక్టర్లకు అనుమానం ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. ఎక్సెస్ టెండర్ల విషయంలో తమ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రే ఉంటారని.. అందులోకి తనను తీసుకుంటాన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ హైకోర్టులో తన పోరాటం కొనసాగుతుందన్నారు ఆర్కే. మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఉంటోంది అక్రమ నిర్మాణంలోనేనన్నారు. చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడడంపై సటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని, చంద్రబాబు ఎక్కడ కట్టుకున్నారని ప్రశ్నించారు.

Tags

Next Story