తెలంగాణ మంత్రివర్గ సమావేశం..రైతు బంధు పథకంపై..

తెలంగాణ మంత్రివర్గ సమావేశం..రైతు బంధు పథకంపై..

కొత్త నిర్ణయాలు, పెండింగ్‌లో వున్న అంశాలకు క్లియరెన్స్‌లు. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.. ఈ భేటీలో సెక్రటేరియట్‌ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు

తెలంగాణ మంత్రి మండలి మూడు నెలల తర్వాత ఈరోజు సమావేశమవుతోంది. బడ్జెట్ సెషన్‌ కోసం ఫిబ్రవరిలో భేటీ కాగా.. ఎన్నికల కోడ్ కారణంగా మళ్లీ ఈరోజు సమావేశమవుతోంది. ఇటీవల ఏపీ భవనాల కోసం గవర్నర్‌కు అందించిన తీర్మానంపైనా సర్క్యులేషన్‌ పద్ధతిలోనే మంత్రుల సంతకాలు తీసుకున్నారు.. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో వాటన్నిటికీ క్లియరెన్స్‌ ఇవ్వనునంది మంత్రివర్గం. ముఖ్యంగా ఇప్పుడున్న సెక్రటేరియట్‌ను కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొత్త అసెంబ్లీ నిర్మాణంపైనా కేబినెట్‌లో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందిస్తున్నారు. డ్రాఫ్ట్‌ బిల్లును కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.

ఎన్నికల కోడ్‌ కారణంగా కేబినెట్ సమావేశం జరగకపోవడంతో.. రైతు బంధు పథకానికి నిధులు విడుదల, డీఏ పెంపు లాంటి కొన్ని పెండింగ్‌ అంశాలకు సంబంధించి ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది.. వీటికి కేబినెట్‌ ఆమోదం పొందలేదు. అలాగే నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వీటన్నిటికీ కేబినెట్‌ అనుమతి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు.. తాజా భేటీలో రాటిఫికేషన్‌ చేయనున్నారు.

లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వీటిని నాలుగేళ్లలో చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, క్షేత్ర స్థాయి పరిస్తితులపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన పెంపుపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీనిపై గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించే విషయంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది కాళేశ్వరం నుంచి మూడు టిఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం అదనంగా మరో ఇరవై వేల కోట్ల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా మంత్రివర్గ సమావేశంలో 100కుపైగా అంశాలు ఎజెండాలో ఉన్నాయి. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story