ఆ సొమ్ము రైతులకే ఇచ్చేయండి : బ్యాంకర్లకు స్పష్టం చేసిన జగన్

ఆ సొమ్ము రైతులకే ఇచ్చేయండి : బ్యాంకర్లకు స్పష్టం చేసిన జగన్

పాత ప్రభుత్వ బకాయిలు చెల్లించేది లేదని బ్యాంకర్లకు స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంర్ల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకర్లతో జగన్‌ మొదటిసారి సమావేశమయ్యారు.. 2019-20 సంవత్సరానికి 2లక్షలా 29వేలా 200 కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై బ్యాంకులకు దిశా నిర్దేశం చేశారు.

గత ప్రభుత్వానికి సంబంధించిన రుణ మాఫీతోపాటు రైతులు, డ్వాక్రా మహిళలు, ఇతర వర్గాలకు చెల్లించాల్సిన వడ్డీ రాయితీలు, ప్రోత్సాహకాలను తమ ప్రభుత్వం ఇవ్వదని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అదే సమయంలో కరువు, తుపాన్ల వంటి విపత్తుల బారిన పడి రైతులు నష్టపోయినందున రైతులను రుణ వసూళ్ల కోసం పీడించవద్దని వారికి సూచించారు. కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాలు వర్తించేలా త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఎస్‌ఎల్బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు ఎందుకు చూపిస్తున్నారని ముఖ్యమంత్రి బ్యాంకర్లను అధికారులను ప్రశ్నించారు. నిజంగా ఆ వర్గాలకు డబ్బు చేరుతోందని అని ఆరాతీశారు. పాత అప్పులు, వడ్డీలు, రెన్యువల్స్‌, రీషెడ్యూల్స్‌ అన్నీ కలిపి చూపిస్తున్నామని బ్యాంకర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అప్పుల పేరుతో మహిళలపైనా ఒత్తిడి చేయొద్దని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. అలాగే రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు సహా పలు పథకాలను బ్యాంకర్లకు వివరించారు. తాము ఇచ్చే సొమ్మును పాత అప్పులకు జమ చేసుకోకుండా.. రైతులకే ఇచ్చేయాలని జగన్‌ స్పష్టం చేశారు.

Tags

Next Story