లేఖ రాసిన చంద్రబాబు.. జగన్, కేటీఆర్..
జమిలి ఎన్నికల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న కేంద్రం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అన్ని పార్టీల అధ్యక్షులతో ఈరోజు సమావేశం కానుంది.. దేశంలో అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలతోపాటు పలు కీలక అంశాలపై భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చాలాకాలంగా కోరుతోంది. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. పార్లమెంట్-అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై న్యాయ శాఖ నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది. జమిలి ఎన్నికల విధానం మంచిదే అని న్యాయశాఖ అభిప్రాయపడింది. ఐతే, దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, తర్వాత 6 నెలల పదవీకాలం ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి పార్లమెంట్‌తో పాటే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఐతే, ఆ విషయంలో కేంద్రం ముందడుగు వేయలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, పూర్తి మెజార్టీతో అధికారం సాధించడంతో కమలదళం మరోసారి జమిలి ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉన్నతస్థాయి రాజకీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కోరింది.
వరుస ఎన్నికలు, ఎలక్షన్ కోడ్‌తో ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బందులు వస్తున్నాయన్నది కేంద్రం వాదన. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి యాత్ర వేగంగా సాగుతుందని కేంద్రం చెబుతోంది. అందుకే జమిలి ఎన్నికలకు అంగీకరించాలని అన్ని పార్టీలను కోరుతోంది. సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు.. మరోవైపు, ఈ కీలకమైన మీటింగ్‌కు కొన్ని పార్టీల అధ్యక్షులు హాజరుకావడం లేదు. సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది.. పార్టీ తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి రాజకీయ పరంగా, చట్టకోణంలో చూడటంతోపాటు కార్యాచరణపైనా నిశిత దృష్టి సారించాలన్నారు. దేశానికి ఏది హితమో ఆ దిశగా ఆలోచించి చర్యలు చేపట్టాలన్నదే తమ అభిప్రాయమని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు మోదీ సర్కారుపై చిటపటలాడుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలపక్ష అధ్యక్షుల సమావేశానికి రావడం లేదని తెలిపారు. జమిలి ఎన్నికల విధానంపై సమగ్రంగా చర్చించే అవకాశం కేంద్రం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. బీజేపీ మిత్రపక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా మీటింగ్‌కు రావడం లేదు. నేడు శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో తాను ఢిల్లీకి వెళ్లడం లేదని ఉద్ధవ్ పేర్కొన్నారు.
మరోవైపు మోదీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో మరో 4 కీలక అంశాలపై సమాలోచనలు జరపనున్నారు. పార్ల మెంట్ ఉభయసభల పని తీరు మెరుగుపరచడం, అత్యంత వెనకబడిన జిల్లాల అభివృద్ధి, 75 ఏళ్ల స్వా తంత్య్ర సంబరాలు-నవభారత నిర్మాణం కోసం సంకల్పం, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com