అక్కడ సీఎం కేసీఆర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు

అక్కడ సీఎం కేసీఆర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ప్రారంభోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి దగ్గర హెలిప్యాడ్‌ల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. హెలిప్యాడ్‌ల నుంచి బ్యారేజి వరకు తారురోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజి వ్యూపాయింట్‌ సమీపంలో, కన్నెపల్లి పంపుహౌస్‌ల సమీపంలో హోమాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు కట్టడంతో పాటు పుష్పాలతో అలంకరించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంత ఖర్చులతోనే నిర్మించిందని ఇప్పటికే కేసీఆర్‌ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. అతి తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు ఆయన.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విగ్రహాన్ని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెట్టేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విగ్రహం పెడితే బాగుంటుందని పలువురి సూచనలతో.. మొదటే విగ్రహ ప్రతిష్ట చేయాలి అనుకున్నా.. వాయిదా వేశారు. మేడిగడ్డ బ్యారేజికి వెళ్లే మార్గంలో క్యాంపు కార్యాలయ సమీపంలో గార్డెన్‌, ఇతర నిర్మాణాలతో పాటు విగ్రహం నెలకొల్పుతారని తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు రానుండటంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నాలుగువేలమంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు. చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు వచ్చారన్న సమాచారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చుట్టూ హై అలర్ట్‌ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story