అక్కడ తీవ్రంగా విజృంభిస్తున్న మెదడువాపు వ్యాధి

బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మెదడువాపు వ్యాధి తీవ్రంగా విజృంభిస్తూ చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ 113కు చేరింది. ముఖ్యంగా ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాల్లో మెదడువాపు వ్యాధి నరకం చూపిస్తోంది. ఆస్పత్రులన్నీ మెదడువాపు వ్యాధి బాధితులతో నిండిపోయాయి.
మెదడువాపు వ్యాధి విజృంభణపై బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తరువాత బాధితులను పరామర్శిద్దామని ఆస్పత్రికి వెళ్లిన సీఎం నితీష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో నితీష్ కుమార్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బీహార్‌లో మెదడువాపు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఊహించనంతగా పెరుగుతోంది. దీంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
కేందమంత్రితోపాటు అక్కడే ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి మంగల్ పాండే.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎన్ని వికెట్లు పడ్డాయి అంటూ మ్యాచ్ గురించి ఆరా తీశారు. పిల్లల మరణాలపై అంతా రోధిస్తుంటే.. అక్కడ క్రికెట్ గురించి మాట్లాడుతారా అంటూ మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర మంత్రి మంగల్ పాండే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రికి పిల్లల మరణాలకంటే క్రికెట్‌పైనే ఆసక్తి ఉందా అంటూ నిలదీస్తున్నాయి.
మరోవైపు మెదడువాపు వ్యాధి మరణాలు ఎంతకీ తగ్గకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు చనిపోతున్నారంటూ మంత్రులపై కేసులు కూడా పెట్టారు.
అధికారులు, వైద్యులు మాత్రం పిల్లల మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మరణాలన్నీ మెదడు వాపు వ్యాధి కారణంగా సంభవించినవి కావని అంటున్నారు. హైపోగ్లైసీ మియా కారణంగా కొందరు చనిపో యారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com