సినిమాల్లో నటిస్తూ.. డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ..

సినిమాల్లో నటిస్తూ.. డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ..

బ్రతకడానికి ఉద్యోగం కావాలి.. నటించడానికి సినిమా కావాలి. ఒకటి వృత్తి.. మరొకటి ప్రవృత్తి. సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా ఎంతో సంతోషం. డబ్బుల కోసం కాదు.. నటన అంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూస్తు పెరిగి పెద్దవాడయ్యాడు. సినిమాల్లో ఓ చిన్న పాత్ర అయినా వేయాలని ఎన్నో కలలు కన్నాడు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా నటిస్తున్నాడు. అలా వచ్చిందే సల్మాన్ ఖాన్ 'భారత్' అనే సినిమాలో చేతన్ రావుకి వచ్చిన అవకాశం. సావధాన్ ఇండియా, దిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ నటన పట్ల తనకున్న కోరికను నెరవేర్చుకుంటున్నాడు.

అయితే సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. చేతన్ రావు చేస్తున్న పనిని ప్రశంసిస్తూ రాజేష్ అనే వ్యక్తి అతడి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. ఫుడ్ ఆర్డర్ చేసిన రాజేష్ అది తీసుకు వచ్చిన చేతన్ రావుని చూసి షాకయ్యారు. మీరు భారత్ సినిమాలో నటించారు కదా అని అనేసరికి తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది అని చేతన్ సంతోషపడ్డాడు.

ఈ విషయాన్ని రాజేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సినిమాల్లో సరైన అవకాశాలు లేక ఆయన పార్ట్ టైం డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కడుపునింపుకుంటున్నారు. ఇలాంటి వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది అని పేర్కొన్నారు. చేతన్ రావు దిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కానీ సినిమాల్లో ఏ చిన్న పాత్ర దొరికినా ఎంతో ఇష్టంతో చేస్తాను అని అంటున్నాడు చేతన్. నటన అంటే ఆసక్తి. నటనలో శిక్షణ తీసుకునేంత స్తోమత లేదు. అందుకే టీవీలోని కార్యక్రమాలు చూస్తూ నటన నేర్చుకున్నానని చెబుతాడు. ముందు స్పాట్‌ బాయ్‌గా పని చేశానని, ఆ తరువాత చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్‌కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు చేతన్.

Tags

Read MoreRead Less
Next Story