జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూనే ఆ అంశాన్ని లేవనెత్తిన జగన్

జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూనే ఆ అంశాన్ని లేవనెత్తిన జగన్

వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ నిర్వహణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్‌ భావించినా కుదరలేదు. దీంతో మళ్లీ రెండోసారి అధికారంలోకి రాగానే ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు ప్రధాని మోదీ. ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అందరి అభిప్రాయాలు తీసుకుంది అధికార బీజేపీ. ఈ సమావేశానికి 21 పార్టీలకు చెందిన అధ్యక్షులు హాజరైతే.. సీపీఐ, సీపీఎం, ఎంఐఎంలు మినహా మిగిలిన పార్టీలన్నీ.. తమ వాధనలు వినిపించినా.. ప్రధానికి నిర్ణయానికి సరే అన్నాయి. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను పంచుకుంటునే జమిలి ఎన్నికలకు ఒకే అని సంకేతాలు ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలు సైతం తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాయి. తెలంగాణ నుంచి సమావేశానికి హాజరైన టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిఎంట్‌.. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఆహ్వానించామన్నారు. రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనే విషయాన్ని ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఏమున్నా.. టిఆర్‌ఎస్‌ తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. పరిమిత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని సూచించామన్నారు. ఒకేసారి ఎన్నికలతో ప్రజలు కూడా ప్రభుత్వ ఫలాలను అనుభవించే వీలుంటుందని కేటీఆర్‌ చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌ జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూనే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఐదేళ్లయినా ఇంకా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నిర్ణీత కాలవ్యవధితో నెరవేరిస్తే సభలో పార్టీల నిరసన ఆగిపోతుందని సూచించారు. రాజీనామా చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యేలను రాజకీయ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఆ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. మరోవైపు సమావేశ ప్రారంభానికి ముందు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిని చూసి ప్రధాని మోదీ ఆప్యాయంగా విజయ్‌ సాయిగారు అని పిలుస్తూ కరచాలనం చేశారు..

ఈ సమావేశానికి మొత్తం 40 పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తే.. కేవలం 21 పార్టీలే హాజరయ్యాయి. అన్ని పార్టీల వాదనలు విన్న కేంద్ర ప్రభుత్వం.. జమిలి ఎన్నికలపై కమిటీ వేయాలని నిర్ణయించింది. నిర్ధిష్ట కాలపరిమితిలో కమిటీ నివేదిక అందించేలా ఏర్పాటు చేయనున్నారు.

Tags

Next Story