కర్ణాటక రాష్ట్రంపై సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
కర్ణాటకలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం, పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రద్దు చేసింది.
గత కొంతకాలంగా రాష్ట్ర నాయకుల తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. పార్టీలో శస్త్రచికిత్స ప్రారంభించింది. పీసీసీ కమిటీలన్నింటినీ రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా మొత్తం 170 మందికిపైగా ఉన్న కార్యవర్గం రద్దయింది. కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, కార్యాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే పదవులు మాత్రం యథాతథంగా ఉంటాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను సస్పెండ్ చేస్తూ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావు కారకులని, వేణుగోపాల్ ఓ బఫూన్ అని బేగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పార్టీ నోటీసు జారీచేసింది. దానికి స్పందించకపోవడంతో సస్పెన్షన్ ఆదేశాలు జారీఅయ్యాయి.
తాజా పరిణామాలపై కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు దినేష్ గుండూరావు స్పందించారు. పార్టీని అన్ని స్థాయిల్లోనూ పునర్వవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు ముందే కమిటీల ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.
ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీవైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ సైతం ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందా అని ఆసక్తిగా చూస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కమిటీలన్నీ రద్దు చేయడంతో.. పరిస్థితి ఇంకాస్త గందరగోళంగా మారింది. అధిష్టానం నిర్ణయంతో ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీ గూటికి చేరితే.. ప్రభుత్వం వెంటనే పడిపోయే ప్రమాదం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com