ఆఖరికి కివీస్‌దే విజయం..

ఆఖరికి కివీస్‌దే విజయం..

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. తాజాగా దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయం సాధించింది. నాలుగో విక్టరీనీ ఖాతాలో వేసుకుంది. 9 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానానికి చేరుకుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీం ఆమ్లా 83 పరుగులు, మిడి లార్డర్‌లో వాన్‌ డర్‌ డుస్సెన్‌ 67 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. పిచ్‌పై తడి ఉండడం, మ్యాచ్‌కు ముందు కొద్దిసేపు వర్షం కురవడంతో బంతి బాగా స్వింగ్‌ అయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న కివీస్‌ బౌలర్లు ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్‌ డికాక్‌ 5, డుప్లెసిస్‌23, మర్‌క్రమ్‌38, డేవిడ్‌ మిల్లర్‌36 పరుగులు చేసి ఔటయ్యారు. వర్షం కారణంగా ఒక ఓవర్‌ కుదించిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 241 పరుగులు మాత్రమే చేయగలిగింది.

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 12 పరుగులకే కొలిన్‌ మన్రో వికెట్‌ కోల్పోయింది. వెంటనే కెప్టెన్‌ విలియమ్సన్‌ క్రీజులోకి వచ్చిన మార్టిన్‌ గప్తిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 35 రన్స్‌ చేసిన తరువాత గుప్తిల్‌ ఔటయ్యాడు. ఆ వెంటనే‌ టేలర్‌ 1, లేథమ్‌ 1 స్వల్ప వ్యవధిలో పెలియన్‌ బాటపట్టారు. జేమ్స్‌ నీషమ్‌ కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నీషమ్‌ ఔటైన తరువాత కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో రన్‌ రేటు పడకుండా చేశారు. న్యూజిలాండ్‌ విజయానికి 12 బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో గ్రాండ్‌హోమ్‌ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శాంటర్న్‌తో కలిసి విలియమ్సన్‌ లాంఛనం ముగించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విలియమ్సన్‌ 138 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేసి తన జట్టుకు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అద్భుత శతకంతో మ్యాచ్‌ను గెలిపించిన విలియమ్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story