ప్రజావేదిక విషయంలో ఏపీ ప్రభుత్వం ట్విస్ట్

ఏపీ రాజకీయాల్లో మరో చిచ్చు రాజుకుంది. చంద్రబాబు నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కలెక్టర్ల సదస్సు కోసం ప్రజావేదిక భవనాన్ని వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవటంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఆందుబాటులో ఉండేలా తన నివాసాన్ని ఉండవల్లిలోని కరకట్టకు మార్చారు. ప్రతినిత్యం ఏదో సమస్యలతో తనను కలిసే ప్రజల సాధకబాధలు వినటంతో పాటు పార్టీ నేతలకు అందుబాటులో ఉండేలా నివాస ప్రాంగణంలోనే ప్రజావేదికను ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో ప్రతిపక్ష నేతగా ఉన్న తమకు ప్రజావేదికను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది టీడీపీ. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, ప్రజలతో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రజావేదికను కేటాయించాలని లేఖ రాశారు.

అటు వైసీపీ కూడా ప్రజావేదికను తమ పార్టీకి కేటాయించాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాసింది. మొదట్లో ప్రజావేదికపై ఎలాంటి స్పందన తెలుపని ప్రభుత్వం.. ఇప్పుడు సడెన్ గా ట్విస్ట్ ఇచ్చింది. 24న తొలిసారి జరగబోయే కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాదు సమావేశం ఏర్పాట్ల కోసం , సీఆర్‌డీఏ కమిషనర్‌, గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్ ప్రజావేదికను పరిశీలించారు. అనంతరం భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఉదయం పది గంటలకు సచివాలయం ఐదో బ్లాక్ లో జరగాల్సిన సమావేశం ప్రజావేదికకు మార్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే..ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత ప్రజావేదిక కావాలని అడిగినా..ప్రభుత్వం భవనాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని తప్పుబడుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయంతో ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ వాయిస్ వినిపిస్తున్న తమ్ముళ్లు..చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story