యావత్ తెలంగాణ ఎదురు చూసిన అద్బుత ఘట్టం

యావత్ తెలంగాణ ఎదురు చూసిన అద్బుత ఘట్టం

యావత్ తెలంగాణ ఎదురుచూస్తున్న అద్బుత ఘట్టం మరి కాసేపట్లో ఆవిష్కృ తం కానుంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ స్వహస్తాలతో నీటిని విడుదలచేసి తెలంగాణ రైతాంగానికి గోదావరి నీటిని అంకితం చేస్తారు.

ఈ చారిత్రక ప్రారంబోత్సవ ఘట్టానికి అతిథులుగా తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థికంగా రుణాలు అందించిన 20 బ్యాంకుల కన్సార్టియం ప్రతినిధులు కూడా ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకొంటున్నారు.

ఉదయం 8:30కి సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి మేడిగడ్డకు చేరుకుంటారు., తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో 10.30కి మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో హోమయజ్ఞం పూర్తి చేసి బ్యారేజీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. తరువాత కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకుని పంపుహౌజ్ 6వ స్విచ్‌ను ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి గోదావరి నీటిని అంకితం చేస్తారు.

అలాగే అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంపుహౌజ్‌ను మంత్రి మహమూద్‌అలీ , సుందిల్ల బ్యారేజీని మంత్రి మల్లారెడ్డి, పంపుహౌజ్‌ను కొప్పుల ఈశ్వర్‌లు ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో 9 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మేడిగడ్డ నుంచి మొదలై.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ వరకూ గోదావరి జలాలు పరుగులుపెట్టబోతున్నాయి ..

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత తెలంగాణలోని ప్రతి గ్రామంలో సంబురాలు జరుపుకోవాలని మాజీ మంత్రి హరీష్‌రావు, పార్టీనేతలు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.. యేళ్ల తరబడి నీళ్లు లేక బీడుబారిన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతుందన్నారు.

అటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే అతిథుల కోసం మొత్తం 16 హెలిప్యాడ్లను అధికారులు సిద్ధంచేశారు. మేడిగడ్డ బరాజ్ వద్ద ఏడు, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద తొమ్మిది హెలిప్యాడ్లను నిర్మించారు. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర హోమశాలల సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story