ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ ముగిసినట్లే..!

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ ముగిసినట్లే..!

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ రేసులో ఉన్న జట్లే ప్రస్తుతం సెమీఫైనల్‌కు చేరువలో నిలిచాయి. అద్భుతాలు జరిగితే తప్ప ప్రస్తుత టాప్ ఫోర్ జాబితానే నాకౌట్ స్జేట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. మిగిలిన వాటిలో ఏ జట్టుపైనా అంచనాలు లేవు. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ లీగ్‌ దశ సగానికి పైనే పూర్తయింది. మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా నిలిచినా... ఓవరాల్‌గా టైటిల్ రేసులో ఉన్న జట్లు వరుస విజయాలతో దూసుకెళుతున్నాయి. దీంతో సెమీఫైనల్‌ చేరే జట్లపై చాలామంది అభిమానులు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌గా ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ , భారత్‌లే నాకౌట్ స్టేజ్‌కు చేరువలో ఉన్నాయి. ఈ నాలుగు జట్లే సెమీస్ చేరడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన ఉన్న ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌లలో ఐదు విజయాలు, ఒక ఓటమితో 10 పాయింట్లు సాధించి దాదాపుగా సెమీస్‌ చేరింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడినా ఆసీస్‌కు సెమీస్ బెర్త్ ఖాయమే. ఆసీస్‌ తన తర్వాతి మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌,సౌతాఫ్రికాలతో తలపడనుండగా.. ఒక్క విజయం సాధించినా నాకౌట్ స్టేజ్ చేరుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఫామ్ చూస్తే లీగ్ స్టేజ్‌ను ఘనంగానే ముగించే అవకాశాలున్నాయి.

అటు రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ కూడా మంచి ఫామ్‌తో దూసుకెళుతోంది. కివీస్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్ వర్షంతో రద్దైంది. కివీస్‌కు కఠిన ప్రత్యర్థిగా భావించిన భారత్‌తో పోరు వర్షంతో రద్దవడం వారికి కలిసొచ్చింది. తర్వాతి మ్యాచ్‌లలో ఆ జట్టు ఇంగ్లాండ్‌, ఆసీస్‌, పాకిస్థాన్, వెస్టిండీస్‌లతో తలపడనుంది. వీటిలో రెండు గెలిచినా.. సెమీస్ బెర్త్ ఖాయం. ఒక్క విజయం సాధించినా.. కూడా కివీస్‌కు సెమీస్ బెర్త్ దక్కే ఛాన్సుంది.

ఇదిలా ఉంటే మూడో స్థానంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి సెమిటైటిల్ రేసులో ఉంది. శ్రీలంకపై గెలిస్తే ఇంగ్లాండ్‌కు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయమైనట్టే. తర్వాతి మ్యాచ్‌లు మాత్రం ఆతిథ్య జట్టుకు సవాల్ విసురుతున్నాయి. ఆస్ట్రేలియా , భారత్‌, న్యూజిలాండ్‌లతో ఇంగ్లాండ్ మిగిలిన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఇంగ్లాండ్‌ దర్జాగా సెమీస్ చేరుతుంది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారిస్తోన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ ఈ మ్యాచ్‌లలో ఎలా ఆడతారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇక న్యూజిలాండ్‌ కాకుండా టోర్నీలో ఓటమే ఎరుగని జట్టు టీమిండియానే. పైగా లీగ్ స్టేజ్ ఆరంభం నుండీ పెద్ద జట్లపైనే విజయాలు సాధించిన కోహ్లీసేనకు మిగిలిన మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ ఒక్కటే కఠిన ప్రత్యర్థి. తర్వాతి మ్యాచ్‌లలో వరుసగా ఆఫ్ఘనిస్థాన్, విండీస్ , శ్రీలంక , బంగ్లాదేశ్‌లతో ఆడనున్న భారత్ రెండు విజయాలు సాధించినా సెమీస్ చేరుతుంది. ఒకవేళ అన్నింటిలోనూ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ దక్కుతుంది.

మరోవైపు టాప్‌ ఫోర్‌ కింద ఉన్న వాటిలో బాగా ఆడుతున్నది బంగ్లాదేశ్‌ మాత్రమే. ఆ జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు షాకిచ్చింది. అయితే 6 మ్యాచ్‌ల తర్వాత బంగ్లా సాధించింది ఐదు పాయింట్లే. తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ వరుసగా.. భారత్‌, అఫ్గనిస్థాన్‌‌, పాకిస్థాన్‌లతో తలపడాల్సి ఉంది. ఈ మూడూ గెలిచినా.. టాప్‌-4లో ఏదో ఒక జట్టు చెత్త ప్రదర్శన చేస్తేనే బంగ్లాకు ఛాన్సుంటుంది. ఇక మిగిలిన జట్లలో ఎవ్వరికీ సెమీస్‌పై ఆశలు లేవు. ప్రస్తుతం వాటి ఫామ్ చూస్తే మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచే అవకాశమే లేదు. ఇప్పటికే సౌతాఫ్రికా కథ ముగిసిపోతే.. అదే బాటలో శ్రీలంక, విండీస్, పాకిస్థాన్ కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ దాదాపు ముగిసినట్లే.

Tags

Read MoreRead Less
Next Story