ఏపీ నిరుద్యోగులకు శుభవార్త
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ప్రకటించిన గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్లను పాటిస్తూ ఈ నియామకాలు చేపడతారు. దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.
రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించారు. వీరికి నెలకు 5వేల వేతనం ఇవ్వనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ స్థానికులై ఉండి, కనీసం ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి ఉండాలి. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అభ్యర్థులకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ నెల 24 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 10 నుంచి దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25వ తేదీ వరకూ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి గ్రామ సేవకుల్ని ఎంపిక చేస్తారు. ఆగస్ట్ 1వ తేదీన ఎంపికైన అభ్యర్థులను ప్రకటించి.. వారికి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com