దక్షిణాదిలో పాగా వేసే దిశగా బీజేపీ అడుగులు

దక్షిణాదిలో పాగా వేసే దిశగా బీజేపీ అడుగులు

దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర బలంగానే ఉంది. ఆ ముద్రను చెరుపుకుని.. దక్షిణాది పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకోవడంలో ఫెయిలైన బీజేపీ.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడంతో తెలంగాణలో పార్టీకి భవిష్యత్ ఉందనే అభిప్రాయానికి వచ్చారు పార్టీ జాతీయ నేతలు. ఏపీ ఎన్నికల్లో చాలాచోట్ల డిపాజిట్‌ కూడా రాకపోవడంతో.. ఇక ఓటర్లను నమ్మకుండా మిగతా పార్టీల లీడర్లపై ఫోకస్‌ పెట్టే పనిలో పడింది బీజేపీ. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌న్‌ ప్రయోగిస్తోంది. ఏపీలో టీడీపీ నుంచి.. తెలంగాణలో కాంగ్రెస్‌ల నుంచి కీలక నేతలు బీజేపీలోకి వచ్చేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో బలమైన నేతలను తమవైపు లాక్కోవడానికి పార్టీ ఇంచార్జీ రాం మాధవ్ ఇప్పటికే రంగంలోకి దిగారు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే పలు పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయానికి అది మరింత పెరిగింది. ఇక కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారం రావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ మాత్రమే బలపడగలిగే పార్టీ అని కొందరు, టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని మరి కొందరు బీజేపీ బాట పడుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలందరూ బీజేపీలోకి రానున్నారని సమాచారం. టీడీపీ కీలక నేతల్లో కొందరు గతవారం ఢిల్లీలో అమిత్‌ షాను కలవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. అటు ఏపీలో రాజ్యసభ సభ్యులు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం, ఇంకా చాలా మంది టీడీపీ నేతలు త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు నెగ్గడంతో బీజేపీ బలానికి పునాదులు పడ్డాయి. ఇప్పడు ఇతర పార్టీల నేతలంతా తమవైపు చూస్తుండడంతో.. ఆపర్ష్‌ ఆకర్షన్‌ ఇంకాస్త ముమ్మరం చేస్తోంది బీజీపే. తెలంగాణలో చాలామంది సీనియర్‌ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జాతీయ నేత మురళీ ధర్‌ రావు అన్నారు.

దక్షిణాదిన బలపడాలనుకుంటున్న బీజేపీకి.. పక్క పార్టీల నేతల చేరికలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. మొత్తానికి రాజకీయ సంక్షోభాన్ని వాడుకొని తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టిడిపిలను భూస్థాపితం చేస్తోన్న బీజేపీ టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.. మున్సిపల్‌ ఎన్నికల ద్వారా తమ సత్తాచాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Tags

Next Story