ప్రముఖ నటుడు, పార్టీ అధ్యక్షుడి ఆస్తుల వేలం..!

బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో DMDK అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత చిక్కుల్లో పడ్డారు. వారి ఆస్తులను వేలం వేయనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. దీంతో DMDK కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంచీపురం జిల్లా మామండూర్లో 4 లక్షల 38 వేల చదరపు అడుగల విస్తీర్ణంలోని శ్రీ ఆండాళ్ అళగర్ కళాశాల, చెన్నై సాలిగ్రామంలోని 3 వేల చదరపు అడుగుల ఇంటిపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో విజయకాంత్ రుణం తీసుకున్నారు. ఇందుకు ఆయనతో పాటు సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ష్యూరిటీ ఇచ్చారు.
అప్పు వడ్డీతోపాటు ఇతర బాకీలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి ఆస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. ఇ-వేలం ప్రకటనను శుక్రవారం దినపత్రికల్లో విడుదల చేసింది. జులై 26న ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ తెలిపింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కార్యకర్తలను కలుసుకోకపోవడం గమనార్హం. కెప్టెన్ ఆస్తులు కాపాడుకుంటామని విజయకాంత్ సతీమణి ప్రేమలత తెలిపారు. రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఏర్పడిన పరిస్థితే ప్రస్తుతం అండాళ్ అళగర్ కళాశాలకు ఉందని నిజాయతీపరులకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com