హైదరాబాద్‌ లో కుండపోత వర్షం

హైదరాబాద్‌ లో కుండపోత వర్షం

నైరుతి వచ్చింది.. వస్తూ వస్తూనే వర్షాలతోపాటు హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలను మోసుకొచ్చింది.. చిన్న చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్‌ రోడ్లపై కుండపోత వర్షం కురిపించి తర్వాత నగర వాసులకు చుక్కలు చూపించింది. రుతుపవనాల ఆగమనంతో ఉదయం నుంచే వాతావరణం చల్లగా మారగా.. సాయంత్రానికి దట్టమైన మేఘాలు ఆవరించాయి.. గంటపాటు కుండపోత వర్షం కురిసింది.. వనస్థలిపురం నుంచి పటాన్‌చెరు వరకు.. ఇటు తార్నాక నుంచి జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి వరకు భారీ వర్షం కురిసింది.. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. కొన్ని చోట్ల మోకాళ్ల లోతున నీళ్లు నిలిచిపోయాయి..

భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు చేరడంతోపాటు.. డ్రైనేజ్ నీరు రోడ్లపై పారడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.. దీనికితోడు గతుకుల రోడ్లు, నాలాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశాయి. వాహనదారులు గంటల కొద్దీ రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి. ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్‌సిటీ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కూకట్‌పల్లి వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతుండటంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో కిలోమీటరు దూరం ప్రయాణానికి కూడా గంటకుపైగా సమయం పట్టింది.. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇక ట్రాఫిక్‌ జంజాటం నుంచి బయటపడేందుకు కొంతమంది వాహనాలను రోడ్ల పక్కనే పార్క్‌ చేసుకుని మెట్రో బాట పట్టారు.. దీంతో మైట్రో స్టేషన్లు, రైళ్లు జనంతో కిక్కిరిసి కనిపించాయి.. ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరగడంతో మెట్రో సర్వీసులను పెంచారు అధికారులు.. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన తాకిడి అర్థరాత్రి వరకు కనిపించింది.. అటు అధికారులు కూడా ప్రయాణికులు క్లియర్‌ అయ్యే వరకు మెట్రో రైళ్లను నడిపారు.. హైటెక్‌ సిటీ నుంచి నాగోల్‌, మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ రూట్లలో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది..

ట్రాఫిక్‌ దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మెట్రోలోనే జర్నీ చేయాల్సి వచ్చింది.. హీరో నితిన్ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో.. ట్రాఫిక్‌ను చూసి భయపడిపోయారు.. కారు అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కారుకి బదులుగా మెట్రో ఎక్కారు. తన మెట్రో జర్నీని నితిన్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story