దాని పరిస్థితి చూస్తుంటే ఏ రైతుకైనాకడుపు తరుక్కు పోతోంది

నిజామాబాద్‌లో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. స్థలం ఖాళీగా కనిపిస్తే కర్చీఫ్ వేస్తున్నారు. చెరువులు, కుంటలు, కాలువలు ఇలా కంటికి ఏది కనిపిస్తే దాంట్లో పాగా వేస్తున్నారు. వీళ్ల భూ దాహానికి నీటివనరులు అదృశ్యమవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద ఉన్న రామర్ది చెరువు. గతమెంతో ఘనం. పదేళ్ల క్రితం వరకు ఈ చెరువు విస్తీర్ణం 29 ఎకరాలు. నిండా నీటితో కళకళలాడి అన్నదాతలకు అండగా ఉండేది. ప్రస్తుతం దీని పరిస్థితి చూస్తుంటే ఏ రైతుకైనా కడుపుతరుక్కుపోతోంది..
రైతులుకు నీరందించడంతోపాటు పర్యాటకంగానూ పనికొస్తుందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ భావించింది. మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలని శంకుస్థాపన కూడా చేశారు. నిధులురాక పనులు మొదలుకాలేదు. రియల్ ఎస్టేట్ మాఫియా రంగంలోదిగింది. రియల్టర్లు, స్థానిక లీడర్లు చెరువును వీలైనంతవరకు అక్రమించారు.S
వర్షపు నీటితోపాటు నిజాంసాగర్ ప్రధాన కాలువ వదిలినపుడు ఈ రామర్ది చెరువు నింపుతారు. ఇక్కడి నుంచి కాలువల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందిస్తారు. కానీ అదంతా గతం. ఓవైపు కబ్జాలు యథేచ్ఛగా కొనసాగుతుంటే మరోవైపు బాయిల్డ్ రైస్ మిల్లులు వెదజల్లే వ్యర్థాలు చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. కబ్జాలు, వ్యర్థాలపై అర్సపల్లి రైతులు గత పదేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు.
రియల్ దందాకు బక్కచిక్కన మరో చెరువు గాడికుంట. 15 ఎకరాల చెరువు కబ్జాకోరల్లో చిక్కి మూడెకరాలు కూడా మిగల్లేదు. భూ బకాసురల చేతుల్లో పడి పురాతన గొలుసుకట్టు చెరువులన్నీ మాయమవుతున్నాయి. వేల ఎకరాలకు నీరందించిన చెరువులు.. నేడు చిన్న గుంటలుగా కనిపిస్తున్నాయి. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అంటూ చెరువుల్ని సంరక్షిస్తుంటే... నిజామాబాద్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రైతుల ఆవేదనను పట్టించుకునేవారే లేకుండాపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com