తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ సపోర్ట్ ఆ పార్టీకేనా..?
ఏపీలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దేశంలోని పలు పార్టీలు ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. తాజాగా సినీనటుడు కమల్ హాసన్‌ను.. ప్రశాంత్ కిశోర్ కలవడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రశాంత్ కిశోర్.. కమల్ హాసన్ తో 2 గంటల పాటు సమావేశమయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో MNM పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం ఖాయమనే ప్రచారం మొదలైంది. అయితే వివరాలు వెల్లడించేందుకు MNM పార్టీ వర్గాలు నిరాకరించాయి.
ఇటీవలి ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఏం చేయాలనే విషయంపై కమల్ హాసన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది..ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ తో ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు 2021లో జరగనున్నాయి.
ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ సేవలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్ టీమ్‌తో ఆమె ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇప్పుడు పీకే కోసం తమిళ పార్టీలు కూడా క్యూ కడుతున్నాయి.. ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకోవాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పీకే కమల్ హాసన్ కలవడంతో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com