గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి జీవో జారీ..వాలంటీర్ అర్హత..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి జీవో జారీ అయింది.. ఆగస్టు 15 నాటికి బాధ్యతలు చేపట్టేలా నియామక ప్రక్రియ చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ప్రకటించిన గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టనుంది ప్రభుత్వం. ఈ ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15నాటికి 4లక్షల గ్రామ వాలంటీర్లను నియమించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే విధివిధానాలు రూపొందించి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈ నెల 24 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 10 నుంచి దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25వ తేదీ వరకూ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి గ్రామ సేవకుల్ని ఎంపిక చేస్తారు. ఆగస్ట్ 1వ తేదీన ఎంపికైన అభ్యర్థులను ప్రకటించి... వారికి మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టనున్నారు.
గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించారు. వీరికి నెలకు 5వేల వేతనం ఇవ్వనున్నారు. ఏ గ్రామానికి చెందిన వ్యక్తులను అదే గ్రామంలో వాలంటీర్లుగా నియమించేందుకు ప్రాథమిక అర్హతగా నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి అర్హత.. మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించారు. కులం, మతం, రాజకీయంతో సంబందం లేకుండా 50 కుటుంబాల పరిధిలో గ్రామ వాలంటీర్లు అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పనిచేయాల్సి వుంటుంది.. ఈ 50 కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ పరిష్కారం దిశగా పనిచేయాల్సి వుంటుంది.. మొత్తంగా నోటిఫికేషన్ వెలువడంతో నిరుద్యోగులంతా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com