కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై హైకమాండ్ కీలక నిర్ణయం?

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై హైకమాండ్ కీలక నిర్ణయం?

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో... రాహుల్ వెనక్కి తగ్గడం లేదు. లోక్ ‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నదానిపై కాంగ్రెస్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గేహ్లాట్‌ పేరు ఖరారైనట్టు సమాచారం. సోనియా, అహ్మద్‌ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ల టీం.. కొత్త అధ్యక్షుడిగా గెహ్లాట్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గేహ్లాట్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనైతే ఈ పదవికి సరైన వ్యక్తని భావిస్తోంది కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం.

అశోక్‌ గేహ్లాట్.. రెండు సార్లు రాజస్థాన్ కు సీఎంగా పనిచేశారు. ఇప్పుడాయన మూడోసారి సీఎంగా చేస్తున్నారు. గత ఏడాది రాజస్థాన్ ఎన్నికల తరువాత సీఎంగా సచిన్ పైలట్ ను అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆ పదవి అశోక్ గెహ్లాట్ ని వరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడాయనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి, సీఎం పదవిని సచిన్‌ పైలట్‌ కు ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మరోవైపు కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందంటూ బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. దీనికి చెక్‌ చెప్పేందుకు.. అశోక్‌ గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించడమే సరైన నిర్ణయంగా భావిస్తోంది.

మరోవైపు.. కాంగ్రెస్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు రాహుల్‌ గాంధీ. అధ్యక్ష పదవిలో ససేమీరా ఉండనంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా కూడా చేశారు. అయితే కాంగ్రెస్​ వర్కింగ్​కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించింది. రాహుల్​ లీడర్‌షిప్‌ కాంగ్రెస్‌కు అవసరమని, ఆయనే పార్టీ చీఫ్​గా కొనసాగుతారంటూ స్పష్టం చేసింది. కానీ రాహుల్ మాత్రం పంతం వీడటం లేదు. అధ్యక్షుడిగా కొనసాగలేనంటున్నారు. దీంతో వేరే దారిలేక మరో అధ్యక్షుడిని వెతికే పనిలో పడింది హైకమాండ్. ఈ క్రమంలోనే.. అశోక్ గెహ్లాట్‌ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాన్ని ఫైనల్‌ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags

Next Story