యార్కర్లు వేయబట్టి సరిపోయింది..లేకపోతే

యార్కర్లు వేయబట్టి సరిపోయింది..లేకపోతే

కూనే అనుకుంటే వణికించింది... కనీస పోటీ అయినా ఇస్తుందా అని తేలిగ్గా తీసుకుంటే చివరి వరకూ విజయం కోసం పోరాడింది... అయితే అనుభవం ముందు తలవంచక తప్పలేదు. ఇదీ టీమిండియాతో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌ ఆటతీరు. ఉత్కంఠ పోరులో కోహ్లీసేన గెలిచినా... అద్భుతంగా పోరాడిన ఆప్ఘనిస్థాన్ అభిమానుల మనసులు గెలుచుకుంది.

లీగ్ స్టేజ్ ఆరంభం నుండీ పెద్ద జట్లపై సునాయాస విజయాలతో అదరగొట్టిన టీమిండియాకు ఆప్ఘనిస్థాన్ చెమటలు పట్టించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు కనీస పోటీనైనా ఇస్తుందా అనే సందిగ్దత మధ్య అదరగొట్టింది. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఆప్ఘన్లు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నారు. అయితే టీమిండియా ఛాంపియన్ ఆటతీరుతో వారికి సంచలనం సృష్టించే అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలానే మన బౌలర్లు చివరి ఓవర్లలో చెలరేగిపోవడంతో ఆప్ఘనిస్థాన్‌ విజయం ముంగిట చతికిలపడింది.

అసలు ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ అనగానే చాలా మంది వన్‌సైడ్‌ వార్‌గా డిసైడైపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీస్కోర్ చేస్తుందని అంచనాకొచ్చేశారు. అయితే మ్యాచ్ మొదలయ్యాక అసలు కథ నడిచింది. బౌలింగ్ పిచ్‌పై మన బ్యాట్స్‌మెన్‌ను ఆప్ఘన్ బౌలర్లు బాగానే ఇబ్బందిపెట్టారు. కోహ్లీ, కేదార్ జాదవ్ , రాహుల్ తప్పిస్తే... మిగిలిన బ్యాట్స్‌మెన్ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. గత మూడు మ్యాచ్‌లూ ఫ్లాట్ పిచ్‌లపై ఆడడంతో బౌలింగ్‌ వికెట్‌పై పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. కోహ్లీ ఔటైనా... చివర్లో కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీతో భారత్ 224 పరుగులు చేయగలిగింది. మంచి బ్యాటింగ్‌ లైనప్ ఉన్న కోహ్లీసేనను ఈ స్కోరుకు కట్టడి చేయడంలో ఆప్ఘన్ బౌలర్ల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఇలాంటి పిచ్‌పై 225 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయడం అంత సులభం కాదన్నది ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు ఆరంభంలోనే తెలిసిపోయింది. అయితే టాపార్డర్ కాసేపు పోరాడినా... వరుస వికెట్లు కోల్పోవడంతో భారత్‌ పుంజుకుంది. ఈ దశలో ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ టీమిండియాను టెన్షన్ పెట్టాడు. ఐపీఎల్‌ ఆడిన అనుభవంతో భారత బౌలింగ్‌పై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో భారీ షాట్లు కొట్టాడు. ఇరు జట్లకూ సమానంగా విజయావకాశాలున్న పరిస్థితుల్లో భారత పేసర్లు అద్భుతంగా పుంజుకుని ఆఫ్ఘనిస్థాన్ జోరుకు బ్రేక్ వేశారు. ముఖ్యంగా బూమ్రా చివర్లో పొదుపుగా బౌలింగ్ చేస్తే... మహ్మద్ షమీ చివరి ఓవర్లో షమీతో పాటు మరో ఇద్దరిని ఔట్ చేసి హ్యాట్రిక్‌తో జట్టును గెలిపించాడు. వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించిన నాలుగో భారత బౌలర్‌గానూ షమీ ఘనత సాధించాడు. బుమ్రా, షమి కట్టుదిట్టమైన యార్కర్లు వేయబట్టి సరిపోయింది. లేదంటే విజయం అఫ్గాన్‌ సొంతమయ్యేది.

కాగా ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌కు ఇది 50వ విజయం. ఇదిలా ఉంటే వన్‌సైడ్ మ్యాచ్‌లతో సాగిపోతోన్న టోర్నీలో ఈ ఉత్కంఠ పోరు అభిమానులను ఉర్రూతలూగిస్తే... భారత్‌ జట్టులో ఉన్న ఛాంపియన్ల ఆటతీరును తెరపైకి తీసుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story