కనుమరుగవుతున్న తోకలేని పిట్ట

కనుమరుగవుతున్న తోకలేని పిట్ట

తోకలేని పిట్ట కనుమురుగైందా... పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గత ఆరు నెలలుగా పోస్ట్‌కార్డ్‌ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక విప్లవం నేపథ్యంలో కార్డు ముక్క తన ఉనికికి కోల్పోయింది. కార్డు తయారీ ఖర్చుకు అమ్మేధరకు ఎక్కడా పొంతనలేకపోవడం వల్ల పోస్టల్‌ శాఖకు ప్రతి ఏటా భారీ నష్టాలే మిగులుతున్నాయి.

ఇంటికి క్షేమంగా చేరగానే ఒక కార్డు ముక్కరాయి. యోగక్షేమాల గురించి కనీసం కార్డు ముక్క కూడా రాయలేకపోయావా. సెల్‌ఫోన్‌లు విజృంభించని రోజుల్లో ప్రతి ఇంటా సహజంగా వినిపించిన మాటలివి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో... పోస్టు కార్డే దిక్కు. దాదాపు 150 ఏళ్ల క్రిందటి ఆ బంధం ఇకపై లేనట్టే అనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పోస్టు కార్డు కూడా లేకుండా పోయింది. వాడకుండా మిగిలిపోయినవి ఎక్కడైనా ఉంటే తప్ప ఏ పోస్టాఫీసులోనూ కార్డులు కనిపించడంలేదు. తెలంగాణ సర్కిల్‌ ప్రధాన తపాలా కార్యాలయం జీపీఓ పరిధిలోనూ కార్డులు లేవు. గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి.

ఇన్‌లాండ్‌ లెటర్స్, పోస్టు కార్డులు దేశవ్యాప్తంగా రెండు చోట్ల ముద్రిస్తారు. హైదరాబాద్, నాసిక్‌లలో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలో ప్రింట్‌ చేస్తారు. డిమాండ్, వాడకం బాగా తగ్గడంతో కేవలం నాసిక్‌ ప్రెస్‌లోనే పోస్టు కార్డులను ముద్రించేవారు. ఇక్కడి నుంచే గత సార్వత్రిక ఎన్నికల ముందు కొంత కోటా తెలంగాణకు విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వాటి జాడలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తే వాటి ముద్రణనే నిలిపేసినట్లు తెలిసింది. దీంతో పోస్ట్‌కార్డుల చలామణీని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పోస్టు కార్డు విలువ 50 పైసలు. అత్యవసర వస్తువుల పరిధిలోనిదిగా నామమాత్రపు ధరకే తపాలాశాఖ వాటిని అందుబాటులో ఉంచుతోంది. మందంగా, అట్టలాగా ఉండే పోస్టుకార్డు ముద్రణతో తపాలాశాఖ ఏటా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ కార్డు తయారీకి దాదాపు 7రూపాయల 45 పైసలు ఖర్చవుతుంది. కేవలం 50 పైసలకే అమ్ముతున్నారు. ప్రతి కార్డుపై దాదాపు 6 రూపాయల 95 పైసల నష్టం వస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలనే జనం దాదాపుగా మరచిపోవడం, ఇతర అవసరాలకు కూడా పోస్ట్‌కార్డు వాడకం నామమాత్రంగా మారడంతో వాటిని ఇక నిలిపేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

జనం పోస్టుకార్డులను కొనడం బాగా తగ్గించారు. ఇటీవల కొన్ని పట్టణాల్లో వాటి వినియోగంపై అధికారులు లెక్కలు తీశారు. నిజామాబాద్‌లో ఏడాది మొత్తంలో అమ్ముడైన కార్డుల సంఖ్య కేవలం 69. వాణిజ్య అవసరాలకు తప్ప వ్యక్తిగత అవసరాలకు కార్డుల వాడకం దాదాపు లేదు. మన దేశంలో 163 ఏళ్లపాటు కొనసాగిన టెలిగ్రామ్‌ సేవలను BSNL 2013 జూలై 15న శాశ్వతంగా నిలిపేసింది. ప్రతి ఏటా 400 కోట్ల నష్టాలు వస్తున్నట్లు పేర్కొంటూ ఆ విభాగాన్ని మూసేసింది. ఇప్పుడు అదే తరహాలో తపాలా కార్డులతో నష్టాలు వస్తున్నందున పోస్టుకార్డు చరిత్రకు కూడా ముగింపు పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story