వెంకన్న భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

వెంకన్న భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంట స్టేషన్లకు మహర్దశ పట్టనుంది. వీటి అభివృద్దికి వచ్చే రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. అటు వచ్చే పదేళ్లలో తిరుపతి రైల్వేస్టేషన్‌ స్మార్ట్‌ స్టేషన్‌గా రూపుదిద్దుకోనుంది. ఈ దిశగా రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది.. ఈ నాలుగు స్టేషన్ల అభివృద్ధితో తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

శ్రీవారి భక్తుల కోసం తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంట రైల్వే స్టేషన్ల సమగ్రాభివృద్ధికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టనుంది. ఇందు కోసం 500కోట్లను ఖర్చు చేయనుంది. పదేళ్ల ప్రణాళికతో ఈ నాలుగు రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయడానికి ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయనుంది. తిరుపతి వెస్ట్‌ రైల్వేస్టేషన్‌లో ఐదు పిట్‌ లైన్లు.. తిరుపతి మెయిన్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్న పిట్‌ లైన్ల స్థానంలో ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రైల్వే మంత్రి పియూష్‌ గోయల్ తిరుపతి రైల్వే స్టేషన్‌ పరిశీలించారు. ఆయన సూచనల మేరకు ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కసరత్తు చేస్తోంది రైల్వే శాఖ.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక తిరుపతి స్మార్ట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని భారత రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్ చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన ప్రయాణికులు వేచి ఉండే గదులు, ప్రథమ చికిత్స కేంద్రం, కౌంటర్లు, ప్లాట్‌ఫారాల్లో వసతులను పరిశీలించారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ ఏర్పాటుపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. విమానాశ్రయాల్లో ఉండే తరహాలో తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన వీఐపీ ప్రీమియం లాంజ్‌ గురించి దేశమంతా చర్చించుకుంటున్నారని కొనియాడారు.

అటు తిరుపతి సమీపంలోని రాయలచెరువు రోడ్డు-రైల్వే వంతెన తన కలల ప్రాజెక్టు అని, దాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని వినోద్‌ కుమార్ హామీ ఇచ్చారు. చంద్రగిరి-రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య 12 ఎల్‌సీ గేట్లు లాక్‌చేసి వాటి స్థానంలో అండర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నామని చెప్పారు. 32 కోట్లతో నిర్మిస్తున్న తిరుచానూరు స్టేషన్‌ డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందన్నారు. ఈ నాలుగు స్టేషన్ల అభివృద్ధి త్వరగా పూర్తి అయితే తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tags

Next Story