అది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి : సీఎం జగన్

అది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి : సీఎం జగన్

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పలు సూచనలు చేశారు. మనమంతా ప్రజలకు సేవకులన్న విషయం ప్రతి నిమిషం గుర్తించుకోవాలని అన్నారు. మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియని పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. నవరత్నాలే ప్రభుత్వ మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలన్నారు.

దాదాపు 2 లక్షల మంది ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలయ్యారని గెలిచిన వాళ్లు మరిచిపోవద్దన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు గానీ, ప్రజలు గానీ కలెక్టర్ల దగ్గరకు వస్తే చిరునవ్వు కనబడాలన్నారు. ప్రజల నుంచి సమస్యలను ఎమ్మెల్యేలు తీసుకొని వస్తారు. వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నామన్నారు. 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఇళ్ల బాధ్యత గ్రామ వాలంటీర్‌దే అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. అర్హుడైన లబ్ధిదారుడికి ప్రతి పథకం అందాలని, గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్‌ చేయాలి. తప్పు జరిగితే వెంటనే వారిని తొలగిస్తామని ముందే హెచ్చరించారు.

ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలని పిలుపు ఇచ్చారు. పాలన పరంగా చూస్తే ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలన్నారు. ప్రజలు హక్కుగా పొందాల్సిన సేవలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. కార్యాలయాల చుట్టూ తిరిగేలా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story