ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన జనసేన.. ఇప్పుడు..
పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కొత్త తరం రాజకీయ వ్యవస్థ రూపకల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేనాని.. భవిష్యత్తులో బలం పెంచుకునేందుకు ఇప్పట్నుంచే పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన కమిటీలను ప్రకటించనున్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని పరిపుష్టం చేయాలనే కృత నిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది జనసేన పార్టీ.. ఓటమిపై ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన పవన్.. తాజాగా పార్టీలో ముఖ్యమైన కమిటీల ఏర్పాటుకు సిద్ధమయ్యారు.. పలు కమిటీలకు సంబంధించి సభ్యుల పేర్లను ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు.
కొత్తతరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తామని గతంలో అనేకసార్లు పవన్ చెప్పుకొచ్చారు.. సమసమాజ నిర్మాణం, యువతరానికి పాతికేళ్ళ భవిష్యత్తును అందించడానికే జనసేనను స్థాపించినట్లు ఎన్నికల క్యాంపెయిన్‌లో చెప్పుకొచ్చారు.. ఈనేపథ్యంలోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్ వ్యూహాలను రూపకల్పన చేస్తున్నారు. యువత భవిష్యత్తుని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కమిటీల ఏర్పాటుపై నిర్ణయానికొచ్చారు జనసేనాని.. ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో కమిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఇందులో భాగంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మానిటరింగ్ కమిటీ అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మానిటరింగ్ కమిటీలకు సంబంధించి సభ్యులను ఈరోజు పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో దృఢమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనుకుంటున్నారు జనసేన అధినేత. ఈరోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కీలకమైన కమిటీలకు సభ్యులను ప్రకటించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com