ఏ పార్టీవారున్నా.. ఎంతటి పేరున్నా విడిచిపెట్టొద్దు - జగన్
ప్రత్యేకహోదా ఉద్యమకారులపై అన్ని కేసులు ఎత్తేయాలని ఏపీ సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి కింది స్థాయి వరకు అంతా శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్.. ఏపీలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండాలి అన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించేందుకు వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నామని ప్రకటించారు. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి అన్నారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలకు మన కళ్లతో చూశాం.. ఇకపై అలాంటి వాటికి మన ప్రభుత్వంలో తావు ఉండకూడదన్నారు జగన్.
రెండో రోజు శాంతిభద్రతల అంశంపై జగన్ సమీక్ష నిర్వహించారు. కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వ్యాఖ్యానించారు.
ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై పోలీసు నిఘా విభాగం, గ్రేహౌండ్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. గంజాయి సాగును నిరోధించేందుకు కొత్త తరహా ప్రణాళికలు తయారుచేయండని సూచించారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. ఎన్నికల తర్వాత గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉందని, 12,198 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. విభజన హామీల మేరకు కొత్తగా ఆరు ప్రత్యేక పోలీసు బెటాలియన్లు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు రావాల్సి ఉందని తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేయడంపై ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పటిష్ఠం చేస్తామని, రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com