కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై సీఎం జగన్ సీరియస్.. అక్టోబర్ 1 నాటికి..

అమరావతిలో కలెక్టర్ల సదస్సు రెండోరోజు కొనసాగుతోంది. ఇవాళ ఐపీఎస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ ఆపరేషన్ నిర్వహిస్తామని సీఎం జగన్ చెప్పారు. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించాలని, పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజన్స్, గ్రేహౌండ్స్ సమన్వయం చేసుకుని.. ప్రణాళికతో రావాలని సీఎం జగన్ ఆదేశించారు.
కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అలాంటివి మళ్లీ జరగకూడదని గట్టిగా చెప్పారు. కాల్‌మనీ కేసుల్లో ఏ పార్టీ వాళ్లు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ వ్యవస్థను క్లీన్ చేయాలన్న సీఎం జగన్.. ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. అక్టోబర్ 1 నాటికి మద్యం బెల్ట్‌షాపులు ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైవేల వెంబడి, దాబాల్లో లిక్కర్ అమ్మకుండా చూడాలన్నారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో ముందడుగు పడాలని పిలుపునిచ్చారు.
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై అలర్ట్‌గా ఉండాలని, నిఘా పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. సమాజానికి చేటు తెచ్చే వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చే పరిస్థితే ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com